6 April, 2026 | 2:47 AM

మావో మల్లయ్యకు సెలవ్...

07-12-2024 08:16 PM

పెద్దపల్లి జిల్లా రాణాపూర్‌లో అంతిమ వీడ్కోలు..

తరలివచ్చిన ప్రజా, పౌర హక్కుల నేతలు..

ఎర్ర జెండాలతో ఎరుపెక్కిన రాణాపూర్

30 ఏళ్ల తర్వాత విగత జీవిగా చూసి గుండెలవిసేలా రోదించిన భార్య, కుటుంబ సభ్యులు

పెద్దపల్లి (విజయక్రాంతి): మావోయిస్టు మల్లన్న ఉద్యమ ప్రస్థానం ముగిసింది. 30 ఏళ్లుగా  తల్లిదండ్రులను విడిచి అడవి బాట పట్టిన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన మావోయిస్టు నేత ఏగోలపు మల్లయ్య ఇటీవల ములుగు జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, శనివారం మల్లయ్య మృతదేహం స్వగ్రామంకు చేరింది. కడసారి చూపు కోసం పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, చుట్టు ప్రక్కల గ్రామస్థులు, కళాకారులు భారీగా తరలిరావడంతో రాణాపూర్ గ్రామం శోకసంద్రంలో మునిగింది. జోహార్ మల్లన్న అంటూ కళాకారులు తమ ఆట పాటలతో వీడ్కోలు పలికారు. కాగా, 30 ఏళ్ల తర్వాత విగత జీవిగా ఇంటికి వచ్చిన మల్లయ్య మృతదేహంపై భార్య, కుటుంబ సభ్యులు పడి కన్నీటి పర్యంతమయ్యారు.

ఎర్ర జెండాలతో గ్రామం ఒక్కసారిగా ఎరుపెక్కింది. మల్లయ్యను కడసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. 17 ఏళ్ల ప్రాయంలోనే మావోయిస్టు ఉద్యమంలో చేరిన మల్లయ్య ఆనాటి నుంచి ఇప్పటివరకు ఇంటి వైపు చూడలేదు. అన్నలకు పెట్టింది పేరుగా రాణాపూర్ గ్రామం ఉంది. కానీ ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లలో అందరూ చనిపోగా మల్లయ్య ఒక్కడే ఉద్యమంలో కొనసాగుతూ వచ్చాడు. చివరిగా మల్లయ్య కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో ఇక రాణాపూర్ గొల్లుమంది. కాగా, ఒక విప్లవ ద్రోహి వల్లనే మల్లయ్య బూటకపు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని మల్లయ్య భార్య మీనాతో పాటు ప్రజా, పౌర హక్కుల సంఘం నాయకులు ఈ సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అన్నంలో విషం పెట్టి మావోయిస్టులు స్పృహ కోల్పోయాక పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్ర హింసలకు గురి చేసి అనంతరం ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపించారు. కాగా, కళాకారుల విప్లవ గేయాలు, కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్థుల కన్నీటి వీడ్కోలు మధ్య మల్లయ్య అంత్యక్రియలు జరిగాయి.