సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు
- వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్ హాజరు
- అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్, జూలై 6(విజయక్రాంతి): హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద చోటుచేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సోమవారం సినీ హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అల్లు అర్జున్‌కు వర్చువల్‌గా హాజర య్యేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అల్లు అర్జున్ ముంబై షూటింగ్‌లో ఉండడంతో వర్చువల్‌గా హాజరయ్యేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో నిందితులు కొంతమంది వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరుకాలేదు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల29కి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులకు సంబంధించి 500 పేజీల ఛార్జ్‌షీట్ కాపీలను కోర్టుకు పీపీ అందజేశారు.
ఈ కేసుకు సంబంధించి గత విచారణలోనూ అల్లుఅర్జున్ వర్చువల్‌గా హాజరైన సంగతి తెలి సిందే. సోమవారం విచారణకు సంబంధించి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకా వాల్సిందిగా అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే అర్జున్ షూటింగ్‌లో ముంబైలో ఉన్నందుకు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అను మతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు కోర్టు అనుమతించింది.






