calender_icon.png 22 October, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి

22-10-2025 12:57:23 AM

  1. షిగెరు ఇషిబా స్థానంలో ప్రధానిగా బాధ్యతలు
  2. ఆ దేశ దిగువ సభలో 465 స్థానాలు ఉండగా.. 237 ఓట్ల సాధన
  3. మెజార్టీ మార్క్ అధిగమించి గెలుపు 
  4. శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ

టోక్యో, అక్టోబర్ 21: జపాన్ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆ దేశ తొలి మహిళ ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)లో అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన సనే తకైచి ఘన విజయం సాధించి ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా పదవిని అలంకరించనున్నారు.

దిగువ సభలో మొత్తం 465 స్థానాలు ఉండగా, ఆమె 237 ఓట్లు సాధించి మెజారిటీ మార్క్‌ను అధిగమించారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోవడంతో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు నిర్వహించగా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి తకైచి విజయం సాధించారు.

కాగా చైనా విధానాలపై తీవ్ర విమర్శలు చేసే రాజకీయ నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అక్టోబర్ 4న అధికార ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు మంగళవారం జరిగిన ఓటింగ్‌లో ఎల్డీపీ - జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో తకైచికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు సహా పలు కీలక పదవుల్లో ఆమె పనిచేశారు. మరోవైపు జపాన్ ప్రధానిగా ఎన్నికైన సనే తకైచికి భారత ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.