calender_icon.png 22 October, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక వేడుకలకు బుగ్గ శివాలయం సిద్ధం

22-10-2025 07:44:18 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోగల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం(Sri Bugga Raja Rajeswara Devalayam) కార్తీక పౌర్ణమి వేడుకలకు సిద్ధమైంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఈ దేవస్థానానికి రెండవ వేములవాడగా భక్తుల నుండి గుర్తింపు ఉంది. నేటి (బుధవారం) కార్తీక శుక్ల పౌడ్యమి నుంచి ప్రారంభమై వచ్చేనెల నవంబర్ 20 (అమావాస్య)తో కార్తీకమాసం ముగుస్తుండడంతో నెల రోజులపాటు ఈ దేవస్థానంలో భక్తులు తమ ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరునికి మొక్కులు చెల్లించుకుంటారు. కోనేరులో పుణ్యస్నానాలను ఆచరిస్తారు. మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి కార్తిక పూజలకు ఇక్కడికి భక్తులు వస్తారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

కార్తీక పౌర్ణమి వేడుకలలో భాగంగా ఈసారి బుగ్గ దేవాలయం వద్ద భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు కోనేరును శుభ్రం చేసి కొత్త నీటితో సిద్ధంగా ఉంచుతున్నారు. దేవస్థానం ఆవరణ లో ఇప్పటికే పరిసరాలను శుభ్రం చేశారు. కార్తీక సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడం తో ప్రసాదాలు, అన్నదాన వితరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కులు చెల్లించు కునేందుకు దేవస్థానానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే గర్భగుడిలోకి ప్రవేశం కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ప్రత్యేక పూజా కార్యక్రమాలు...

నేటి కార్తీక మాసం ప్రారంభం నుండి శివాలయంలో ఉదయం 6.30 నిమిషాలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉదయం 10 గంటలకు బిల్వార్చన, మధ్యాహ్నం 12 గంటలకు అలంకార సేవ, దివ్య హారతి, 365 వత్తులతో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు జరుపనున్నట్లు అర్చకులు సతీష్ శర్మ చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక సోమవారాల్లో ఉదయం 5 గంటలకు అగ్నిహోత్రం, ఆశీర్వచనం, మహా బిల్వార్చన, అతి రుద్రం, పంచామృతాభివృద్ధి అభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు స్పర్శ దర్శనం, దీప దర్శనం పూజ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.