13-11-2025 08:19:08 AM
సంగారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లకు (పిఆర్ఓలకు) నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సిపిటిసి) నందు జరిగిన ఈ కార్యక్రమం ముగింపు వేడుకకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి (పి.ఆర్.ఓ) పి. నాగరాజు శిక్షణలో సఫలంగా పాల్గొని డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించారు. అధికారుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరింత కృషి చేస్తానని, ప్రజా సంబంధాల పనితీరును మరింత మెరుగుపరుస్తానని పి.ఆర్.ఓ నాగరాజు ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే, ఈ శిక్షణ విజయవంతంగా నిర్వహించినందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజీపి (పి అండ్ ఎల్), రమేష్ రెడ్డి ఐపిఎస్, డీసీపి (సిఏఆర్) రక్షిత మూర్తి, శిక్షణా సమన్వయకర్త మధుసూదన్, తెలంగాణ సురక్ష బృంద సభ్యులు పాల్గొన్నారు.