06-01-2026 01:12:07 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): చెత్త పర్యవేక్షణ తమ వల్ల కాదని, ఉదయాన్నే విధులకు రాలేమంటూ చేతులెత్తేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (డీఈఈ) తీరుపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీని 30 సర్కిళ్ల నుంచి 60 సర్కిళ్లుగా విస్తరించిన నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణలో కీలక మార్పులు చేశారు. గతంలో మెడికల్ ఆఫీసర్లు చూసే పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 60 మంది డీఈఈలకు అప్పగించారు.
ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇంజనీర్లు ఆసక్తి చూపకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సివిల్ వర్క్స్, మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసిన తమకు శానిటేషన్ పనులు సరిపడవని ఇంజనీర్లు వాపోతున్నారు. శానిటేషన్ బాధ్యతలు చూసేవారు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకే ఫీల్డులో ఉండాలి. దీంతో రోడ్లపై చెత్త లేకుండా చూడటం, కార్మికులను పర్యవేక్షించడం తమ వల్ల కాదని అంటున్నారు.
గతంలో కేవలం సివిల్ అండ్ డెమాలిషన్ వేస్టును ప్లాంట్లకు తరలించే పనులను మాత్రమే వీరు పర్యవేక్షించేవారు. ఇప్పుడు పూర్తిస్థాయి పారిశుద్ధ్య పనులు అప్పగించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు డీఈఈలైతే తమ ఇళ్లకు దగ్గరగా ఉండే సర్కిళ్లలోనే పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
చర్యలు తప్పవు: కమిషనర్
అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించకుండా సాకులు చెపుతున్న డీఈఈల తీరును కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్‌గా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపడాల్సిందేనని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించినట్లు తెలిసింది.