27-01-2026 12:28:37 AM
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్‌రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారు వేర్వేరు తేదీల్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు కూడా హాజరయ్యారు.
తాజాగా, మాజీ ఎంపీ సంతోష్‌రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసి మంగళవారం మధ్యాహ్నం ౩ గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంతోష్ రావుకు సిట్ నోటీసులు పంపించినట్టు సమాచారం. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణపై దర్యాఫ్తు సంస్థను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించామని, ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది.
సిట్ నోటీసులపై మాజీ ఎంపీ సంతోష్‌రావు స్పందించారు. సిట్ నోటీసులు అందాయని, మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని, సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకు జవాబు చెబుతానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో సంతోష్‌రావును ఎంపీగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.