calender_icon.png 8 January, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి

07-01-2026 05:38:55 PM

సర్వారం అంగన్‌వాడీ కేంద్రం సందర్శనలో సర్పంచ్ శివకుమార్

ముత్తారం,(విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లల హాజరు శాతాన్ని వంద శాతం పెంచేలా కృషి చేయాలని సర్వారం అంగన్‌వాడీ కేంద్రం సందర్శనలో సర్పంచ్ బియ్యని శివకుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని మైదాoబండ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం పనితీరును మెరుగుపరచడం,  చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడం కోసం సర్పంచ్ అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని వసతులను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ గుడ్లు, పాలు అందుతున్నాయా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు.  గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేసే 'బాలామృతం' ఇతర రేషన్ సక్రమంగా అందుతోందని నిర్ధారించుకున్నారు. కేంద్రంలోని అటెండెన్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. కేంద్రం ఆవరణను మరియు వంట గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

చిన్నారులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందికి చెప్పారు. కేంద్రంలో ఉన్న ఆట వస్తువులను పరిశీలించి, అవి పిల్లలకు సురక్షితంగా ఉన్నాయో లేదో చూశారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేయాలని, ప్రాథమిక క్రమశిక్షణ నేర్పించాలని కోరారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న సరుకుల గడువు తేదీలను  స్వయంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధిగా సమయపాలన పాటించాలని, కేంద్ర నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి లేదా పంచాయతీ దృష్టికి తీసుకురావాలన్నారు.

పిల్లల ఎదుగుదలను గమనిస్తూ ప్రతి నెల వారి బరువు, ఎత్తు వివరాలను నమోదు చేయాలని, చిన్నారులకు వేయాల్సిన టీకాలపై తల్లులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, పప్పు దినుసుల నాణ్యత సంతృప్తికరంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్రానికి అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు, పెయింటింగ్ పనులను త్వరలోనే చేయిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడి సిబ్బంది, సర్పంచ్ ను శాలువాతో సత్కరించారు.