06-01-2026 12:32:57 AM
ఎర్రుపాలెం, జనవరి 5(విజయక్రాంతి): మండల కేంద్రంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను సర్పంచిగా గెలుపొందిన తరువాత నండ్రు అశ్విని నెరవేర్చారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో కొన్నేళ్లుగా కోతులు బెడదతో ఎర్రుపాలెం ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలో రింగ్ సెంటర్ నందు, కూరగాయల షాపుల దగ్గర, హోటల్ దగ్గర, జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ దగ్గర, రోడ్లపైన, ప్రైవేట్ స్కూల్స్ నందు, శివాలయం దగ్గర, బ్యాంకుల దగ్గర, ఇళ్లలో, ఇంటి ఆవరణల దగ్గర, ఇంటి డాబాలపైన, రోడ్ల మీద నడిచి వెళ్లే వారిపై కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ పలువురిని గాయపరుస్తున్నాయి.
ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే భయ కంపితలు అవుతున్నారు. చిన్నపిల్లలను, వృద్ధులను, మహిళలను గాయపరుస్తుండడంతో వీటి దాటికి భయపడి మహిళలు ఇండ్లకే పరిమితమై పోతున్నారు. ఇండ్లలో నివసిస్తున్న వారిని సైతం ఇవి గాయపలుస్తున్నాయి. ఇంటి ఆవరణలో మహిళలు పెంచుకుంటున్న మొక్కలను, కాయగూరలను, పండ్లను కొరికిపారుస్తూ సైర్య విహారం చేస్తున్నాయి. ఇంటి ఆవరణలోకి కోతులు వచ్చినప్పుడు వాటిని తరిమి వేయటానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇవి చిన్నారులను మహిళలను వృద్ధులను గాయపరుస్తున్నాయి.
స్కూల్ కి, కళాశాలలకు వెళ్లే విద్యార్థులను ఇవి గాయపరుస్తున్నాయి. ఇలా కొన్నేళ్లుగా కోతుల నుంచి బాధపడుతున్న ఎర్రుపాలెం ప్రజల సమస్యను సర్పంచ్ గా ఎన్నికైన నండ్రు అశ్విని ప్రమాణ స్వీకారం రోజునే గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే అమలుపరిచి కోతులను పట్టి అటవీ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఎర్రుపాలెం ప్రజలకు సర్పంచ్ గా ఇచ్చిన హామీని తీర్చినందుకు ఎర్రుపాలెం ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.