14-12-2025 09:02:23 AM
మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి
బూర్గంపాడు, (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 13 పంచాయతీలలో గెలుపొందిన సర్పంచుల సన్మాన కార్యక్రమం ఆ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి అధ్యక్షతన శనివారం మండల పరిధిలోని పుష్కర వనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి 22 నెలల్లో చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళామని అన్నారు.
బూర్గంపాడు మండల వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది పంచాయతీలలో ఐదు పంచాయతీలను ఏకగ్రీవము చేసుకున్న ఘనత మన ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఏకగ్రీవం కాలేదని గుర్తు చేశారు. మిగిలిన 13 పంచాయతీలలో నిర్వహించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండు పంచాయతీలు మినహా మిగిలిన అన్ని పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను పోటీలో నిలిచారని మిగిలిన రెండు పంచాయతీలైన మోతే, కోయగూడెం మన మిత్రపక్షమైన టిడిపి బలపరిచిన అభ్యర్థులను పోటీలో నిలుపేమని పేర్కొన్నారు.
కాగా నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు మనకు మనమే పోటీపడి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామం లో వర్గాలుగా విడిపోయి పోటీ చేయడంతో అది బిఆర్ఎస్ పార్టీకి గెలుచుకోవడం మన అనైక్యతకు నిదర్శనం అని భవిష్యత్తులో ఎటువంటి వర్గాలకు అవకాశం లేకుండా అందరం ఐక్యతగా పనిచేయాలని నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటేశ్వర్లు నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల నిధులను కేటాయించారని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఆయన ద్వారా కూడా మన గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులను తెప్పించుకోవచ్చు అని అన్నారు. మన మండలంలో ప్రభుత్వం నుంచి వచ్చే తక్కువ నిధులు వచ్చే గ్రామ పంచాయతీలలో సారపాక గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ స్థానిక ఐటిసి సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు సహకరించే విధంగా ప్రయత్నించాలని కోరారు. అంతకుముందు పలువురు సర్పంచులు పరిచయం చేసుకున్నారు.
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని గ్రామస్తులు తమపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలైన టిడిపి, సిపిఐ, సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఇదే విధమైనటువంటి మిత్రపక్షంగా ఉంటూ భవిష్యత్తులో ప్రతి ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి గెలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మహమూద్ ఖాన్,టిడిపి రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, మాజీ జెడ్పిటిసి బట్ట విజయ్ గాంధీ, టిఎన్టియుసి అధ్యక్షులు హరిప్రసాద్, ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, టిఎన్టియుసి చైర్మన్ గల్లా నాగభూషయ్య, నూతన సర్పంచులు కిషోర్ నాయక్, బాదం వెంకటేశ్వర రెడ్డి,మంద నాగరాజు, తాటి వాణి, కుంజా కొండమ్మ, బానోత్ నరసింహ, వర్స మంగమ్మ, బొర్ర సుభద్ర, బొల్లి నిరోషా, సురేందర్, పద్మ,చర్పా నాగమణి,తాటి లక్ష్మి, పలు పార్టీల చెందిన నాయకులు పలు గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన వాటి సభ్యులు పోటీ చేసి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.