03-01-2026 10:28:07 PM
- అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కరీంనగర్,(విజయక్రాంతి): సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదట బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళల విద్యాభివృద్ధికి బాటలు వేసి ఆదర్శంగా నిలిచారని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డిఈఓ అశ్విని వాకడే తానాజీ తెలిపారు. ఆమె కృషి వల్లే నేడు మహిళలన్నిరంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళల హక్కులు, విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సావిత్రిబాయి చిన్నప్పట్నుంచి పోరాటపటిమా ధైర్యంతో ముందుకు సాగారని ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకెళ్లాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలోని మోడల్ స్కూల్, కస్తూర్బా, ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల మహిళా ఉపాధ్యాయులను అదనపు కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కురి శ్రీనివాస్, జిఈసిఓ కృపారాణి, తదితరులు పాల్గొన్నారు.