10-07-2025 06:58:30 PM
చండీగఢ్: గురుపౌర్ణమి రోజే ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఇద్దరు విద్యార్థులు కత్తితో పొడిచి చంపిన ఘటన హర్యానాలోని హిసార్‌లో గురువారం చోటు చేసుకుంది. హిసార్‌లోని బాస్ బాద్షాపూర్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ (50) విద్యార్థులను హెయిర్ కట్ చేయించుకోవాలని, సరిగ్గా దుస్తులు ధరించాలని, పాఠశాల నియమాలు నిబంధనలను పాటించాలని చెప్పారు. మిస్టర్ సింగ్ టీనేజర్లకు తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాలని చాలాసార్లు హెచ్చరించారు.
దీంతో 12వ తరగతి విద్యార్థుల ప్రిన్సిపాల్ పై కోపం పెంచుకున్నారు. అదును చూసుకుని ఇద్దరు విద్యార్థులు ఇవాళ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మడతపెట్టే కత్తిని బయటకు తీసి మిస్టర్ సింగ్‌ను అనేకసార్లు పొడవడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి రక్తస్రావంతో మరణించాడు. ఇతర విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్‌ను ఆసుపత్రికి తరలించడానికి కారులో తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న హన్సి పోలీసు సూపరింటెండెంట్ అమిత్ యశ్వర్ధన్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. క్యాంపస్ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఫుటేజీలో ప్రిన్సిపాల్‌ను పొడిచి చంపిన తర్వాత బాలురు పరిగెత్తుతున్నట్లు, వారిలో ఒకరు మడతపెట్టే కత్తిని దూరంగా విసిరేయడం కనిపిస్తుంది.
ఇద్దరు విద్యార్థులు మైనర్లేనని, వారిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని యశ్వర్ధన్ పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్కాన్ చేసి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే హత్యకు సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులు తెలుస్తాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన క్యాంపస్‌లో భయాందోళనలను రేకెత్తించింది. విషాదకరమైన యాదృచ్చికంగా, ఉపాధ్యాయులు మార్గదర్శకుల పట్ల గౌరవం చూపించడానికి గురు పూర్ణిమగా జరుపుకునే రోజున ఇది జరిగింది.