22 April, 2026 | 4:00 PM

గ్రామంలో గుప్త నిధుల కలకలం

22-04-2026 02:32 PM

గద్వాల టౌన్: గద్వాల మండలం పరిధిలోని పరుమాల గ్రామంలో గుప్త నిధుల అన్వేషణ పేరుతో జరిగిన అనుమానాస్పద తవ్వకాలు బుధవారం గ్రామంలో కలకలం రేపాయి. గ్రామ శివారులో ఉన్న శ్రీ రంగస్వామి ఆలయ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆవరణలోని శివలింగం, వినాయక విగ్రహాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు నాలుగు అడుగుల లోతు గుంత తవ్వబడిన ఆనవాళ్లు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఇదే ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పుణ్యక్షేత్రంగా భావించే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చర్యలు జరగడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై అధికారులు,పోలీసులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.