14 April, 2026 | 1:35 PM

ఐటీ శాఖ సెక్రటరీ మార్పులో ‘సీక్రెట్ ఆర్డర్స్’

28-02-2026 12:09 AM
  1. నియామకం జరిగినా జాయిన్ కాని ఎన్. శ్రీధర్
  2. మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే మార్పులా?
  3. సీఎస్ చేతుల్లోకి ఐటీ శాఖ కార్యదర్శి బాధ్యతలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం సచివాలయంలో సంచలనంగా మారింది. ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా నియమితులైన ఎన్.శ్రీధర్ ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించకపోవడం వెనుక అసలు కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, శ్రీధర్ జాయిన్ కాకపోవడం, అదే సమయంలో శాఖను నేరుగా ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు పర్యవేక్షణలోకి ఇవ్వడం పరిపాలనా వర్గాల్లో అనేక అనుమానాలకు దారితీసింది.

ఈ పరిణామాలన్నీ తెలంగాణ సచివాలయంలో హాట్ టాపి క్‌గా మారాయి. ఇప్పటి వరకు ఐటీ, పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వహించిన సంజయ్ కుమార్‌ను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు బది లీ చేసింది. ఆయన ఇప్పటికే కొత్త శాఖలో బాధ్యతలు స్వీకరించారు. సాధారణంగా ఇ లాంటి సందర్భాల్లో కొత్త కార్యదర్శి వెంటనే బాధ్యతలు చేపడతారు. కానీ ఈసారి అలా జరగలేదు. శ్రీధర్‌ను ఐటీ శాఖకు పోస్టింగ్ ఇచ్చినా, బాధ్యతలు స్వీకరించకపోవ డం, శాఖను ఖాళీగా ఉంచకుండా నేరుగా సీఎస్ పర్యవేక్షణలోకి తీసుకోవడం వెనుక అసలు కారణాలపై అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

వ్యూహాత్మకమేనా?...

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఐటీ శాఖలో తీసుకోవాల్సిన కొన్ని కీలక నిర్ణయాలు, పెట్టుబడుల ఫైల్స్, పరిపాలనా అం శాల నేపథ్యంలో ప్రభుత్వం చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని నిలిపివేసిందన్న ప్రచారం ఉంది. కొత్త కార్యదర్శి బాధ్యతలు చేపట్టే ముం దు కొన్ని అంశాలను క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో సీఎస్‌కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మరోవైపు, శాఖలో సమన్వయం, విధాన పరమైన నిర్ణయాల విషయంలో ప్రభు త్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

ఒకవైపు కార్యదర్శి నియామకం, మరోవైపు బాధ్యతలు స్వీకరించకపోవడం, అదే సమయంలో సీఎస్‌కు బాధ్యతలు అప్పగించడంపై సచివాల యంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ రాకపోవడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఐటీ వంటి కీలక శాఖలో ఈ అనూహ్య పరిణామాలు వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు సచివాలయంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. 

మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం లేకుండానే నిర్ణయమా?

అయితే, సాధారణంగా ఏ శాఖలోనైనా కార్యదర్శి మార్పునకు సంబంధించిన విష యం సదరు మంత్రికి తెలిసి, మంత్రి అభిప్రాయం తీసుకున్న తర్వాతే జరుగుతుంది. కానీ ఈ వ్యవహారంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ముందస్తు సమాచారం లేకుండానే కార్యదర్శి మార్పు జరిగిందన్న ప్రచారం సచివాలయంలో బలంగా వినిపిస్తోంది. దీంతో ఇది కేవలం పరిపాలనా నిర్ణయమా? లేక మరేదైనా కారణమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటీ, పరిశ్రమల శాఖ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే కీలక యంత్రాంగం. గ్లోబల్ కంపెనీలతో ఒప్పందాలు, పెట్టుబడుల ఆహ్వానం, ఐటీ విస్తరణ వంటి కీలక అంశాలు ఈ శాఖ పరిధిలో ఉంటాయి. ఇలాంటి శాఖను తాత్కాలికంగా అయినా సీఎస్ చేతుల్లోకి ఇవ్వడం సాధారణ విషయం కాదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటా? లేక కొత్త కార్యదర్శి నియామకంపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.