18-01-2026 06:25:35 PM
సిద్దిపేట క్రైం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ ఆదివారం పర్యవేక్షించారు. ఒగ్గు పూజారులతో మాట్లాడి, ఆలయ విశిష్టతను, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, అలాగే పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో సమన్వయంతో ఉంటూ, జాతర ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. సీపీ వెంట ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసీపీ నర్సింలు , స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ , ఎస్ఐ మహేష్ ఉన్నారు.