29-10-2025 04:40:11 PM
జిల్లాకు చెందిన ఈగ కనకయ్య ఎంపిక..
మందమర్రి (విజయక్రాంతి): గోవాలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 27 వరకు నిర్వహిస్తున్న ఫీడే ప్రపంచ చదరంగం పోటీలు-2025 నిర్వహణకు తెలంగాణ చెస్ అసోసియేషన్ నుండి ప్రతినిధులను ఎంపిక చేశారు. బుధవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్ లో నిర్వహించిన సమావేశానికి అఖిల భారత చెస్ సమాఖ్య రాష్ట్ర ప్రతినిధి కేఎస్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ అసోసియేషన్ నుండి ప్రపంచ చెస్ పోటీల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈగ కనకయ్యతో పాటు నల్గొండ జిల్లా చెస్ కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఆర్బిటార్ కే కరుణాకర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్, తెలంగాణ చెస్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ కార్యదర్శి ఈ అన్వేష్, బి ప్రశాంత్ లను ఎంపిక చేశారు.
వీరంతా గోవాలో జరుగుతున్న ప్రపంచ చదరంగ పోటీల నిర్వహణకు తరలి వెళ్ళనున్నారు. ఈసందర్భంగా ప్రపంచ చదరంగా పోటీల నిర్వహణకు ఎంపికైన ప్రతినిధులు మాట్లాడుతూ, 2002లో తొలిసారి ఈ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించారని గుర్తు చేశారు. గోవాలో నిర్వహించే ప్రపంచ పోటీల్లో 206 మంది దిగ్గజ ఆటగాళ్లు నాకౌట్ పద్ధతిలో 8 రౌండ్స్ జరిగే పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు సుమారు 17 కోట్ల రూపాయల నగదు బహుమతి అందించనున్నారు తెలిపారు. ఈ అవకాశం లభించినందుకు హర్ష్యం వ్యక్తం చేస్తూ, అఖిలభారత చెస్ సమాఖ్య రాష్ట్ర ప్రతినిధి కేఎస్ ప్రసాద్ కు, తెలంగాణ చెస్ అసోసియేషన్ సభ్యులకు, ప్రతి ఒక్కరికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.