సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపి మృతి
- మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి
- సంతాపం ప్రకటించిన జర్నలిస్ట్ సంఘాలు
ఖమ్మం, జూన్ ౨(విజయ క్రాంతి): సీనియర్ జర్నలిస్ట్, ఓ దిన పత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ఇంఛార్జి కూరకుల గోపి మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయం అస్వస్థతకు గురైన గోపిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి కి గురైయ్యారు.
25ఏళ్ళ పాటు జర్నలిస్ట్ గా సేవలందించిన గోపి మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మాలోతు రాందాసు నాయక్, కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, ఎంపీలు రఘురాం రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే జర్నలిస్ట్ యూనియన్ బాధ్యులు, జర్నలిస్టులు కన్నీటి పర్వతమైయ్యారు. 25ఏళ్ళ పాటు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గోపి మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. గోపి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.






