calender_icon.png 30 January, 2026 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం పార్టీకి ఎదురుదెబ్బ..

30-01-2026 04:20:01 PM

మెదక్ లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..

బీఆర్ఎస్ గూటికి సీనియర్ నేత సుప్రభాత్ రావు

కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం: మాజీ మంత్రి హరీష్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై ఎగిరేది గులాబీ జెండానే

మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాత్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బీఆర్ఎస్ లో చేరారు. సుప్రభాత్ రావు గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో NSUI నుంచి పీసీసీ సెక్రటరీ వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నివాసంలో చేరిక కార్యక్రమం జరిగింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ సీనియర్ నాయకులు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సుప్రభాత్ రావు తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు.

వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు. అందుకే అభివృద్ధిని కాంక్షించే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సుప్రభాత్ రావు లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో   చేరుతున్నారు పేర్కొన్నారు.

రామాయంపేటలో సుప్రభాత్ రావు చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్  హయాంలో పట్టణ ప్రగతి తో మన పట్టణాలు, మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. పచ్చదనం, పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాలతో కళకళలాడిన పట్టణాలు.. నేడు కాంగ్రెస్ పాలనలో నిధులు లేక, నిర్వహణ లేక పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వచ్చాక ప్రగతి పూర్తిగా పడకేసిందని, మళ్ళీ మంచినీటి సమస్యలు, పారిశుధ్య సమస్యలు మొదలయ్యాయని  అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని హరీష్ రావు అన్నారు.  ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారు ఉన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగబోయే అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోయేది, విజయ ఢంకా మోగించేది బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సుప్రభాత్ రావు రాకతో రామాయంపేటలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని, కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని కోరారు. పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి బీఆర్ఎస్ కుటుంబం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని హరీష్ రావు గారు భరోసా ఇచ్చారు. అనంతరం సుప్రభాత్ రావు మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదని, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని సుప్రభాత్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని, కేసీఆర్, హరీష్ రావు నాయకత్వంపై నమ్మకంతోనే తాను బీఆర్ఎస్ లో చేరానని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో గులాబీ జెండా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.