30-01-2026 04:35:04 PM
భక్తుల ప్రాణాలతో ఆటలాడుకున్నారు: టీటీడీ ఛైర్మన్
తిరుమల: వైసీపీ హయాంలో భక్తుల ప్రాణాలతో ఆటలాడుకున్నారని శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం ఆరోపించారు. లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారని తెలిపారు. టీటీడీ ఛైర్మన్, ముఠా మేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్ప ఖాతాలోకి రూ. కోట్లు వచ్చాయని, చిన్నప్ప శాతా నుంచి ఎక్కడికి వెళ్లాయో సీబీఐ స్పష్టం చేయాలని కోరారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందని ఆరోపించారు.
జంతువుల కొవ్వులు లేవని ఎక్కడ నిర్ధారణ కాలేదన్నారు. అనేక అక్రమాలు చేసి రూ. వేల కోట్లు సంపాదించారని ధ్వజమెత్తారు. తనపై కోర్టుకు వెళ్లినా కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాలు, వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ప్రమాదకర రసాయనాలు వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. హిందువుల ప్రాణాలు తీసేందుకే వైసీపీ నేతలు రసాయనాలు వాడారని తెలిపారు. కల్తీ నెయ్యి కలిపిన లడ్డూలు కోట్ల మందికి పంచారని తెలిపారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.