30-01-2026 05:12:22 PM
ఘట్ కేసర్ ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించిన రాష్ట్ర విద్యా కమిషన్ బోర్డు సభ్యురాలు జ్యోత్స్న రెడ్డి
ఘట్ కేసర్ ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి తెలంగాణ విద్యా కమిషన్ సానుకూల స్పందన
ఘట్ కేసర్, జనవరి 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ బోర్డ్ సభ్యురాలు జ్యోత్స్న రెడ్డి శుక్రవారం ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాలలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల పాఠశాలలతో పాటు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
గురుకుల ట్రస్ట్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న కోర్టు కేసులు ఇతర వివాదాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈస్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విద్యార్థుల ప్రయోజనాల కోసం విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల బాలికల, బాలుర, గురుకుల ప్రధానోపాధ్యాయులు, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. వీరంతా ఘట్ కేసర్ విద్యా సమస్యలను, మౌలిక వసతుల కల్పన గురించి కమిషన్ సభ్యురాలికి వివరించారు.