30-01-2026 04:16:36 PM
డీఎంహెచ్ఓ డా.కే.రవికుమార్
కల్వకుర్తి: గర్భవతులకు స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేస్తే నిర్వాహకులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.రవికుమార్ హెచ్చరించారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 894 మంది అమ్మాయిలే జన్మిస్తున్నారని, ఇది లింగ నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసాన్ని సూచిస్తోందన్నారు. ఆధునిక కాలంలోనూ అమ్మాయిలపై వివక్ష సరికాదన్నారు.
స్కానింగ్ సెంటర్లలో రికార్డులు, ఫామ్–ఎఫ్‌లను తనిఖీ చేసి, లింగ నిర్ధారణ నిషేధ చట్టానికి సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినవారికి, చేయించుకున్నవారికి, ప్రోత్సహించినవారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50వేలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం స్కానింగ్ సెంటర్లను నిర్వహించడంతో పాటు రేట్ల పట్టికను బయట ప్రదర్శించాలని సూచించారు. వారితో పాటు ప్రోగ్రాం అధికారి డా.లక్ష్మణ్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాల చారి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.