28-11-2025 11:13:20 PM
* సర్పంచ్ పదవికి వేలం వేస్తే క్రిమినల్ కేసులు
* సిద్దిపేట సీపీ విజయ్ కుమార్
హుస్నాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లతో పాటు, త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు, శాంతిభద్రతల అంశాలపై సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం సమీపంలో సీఎం సభ నిర్వహణకు ఎంపిక చేసిన మైదానాన్ని సీపీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, సభా వేదిక, హెలిప్యాడ్ ప్రదేశం, వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి భద్రతా ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని, స్థానిక పోలీసులు, రిజర్వ్ బలగాలను సమన్వయం చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర మార్గాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికలపై సంచలన హెచ్చరికలు
సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. "గ్రామ పంచాయతీ పదవుల కోసం ప్రలోభాలు, బెదిరింపులు, వేలంపాటలు నిర్వహించడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఎవరైనా సర్పంచ్ పదవికి డబ్బు చెల్లించి లేదా వేలం ద్వారా ఎంపికైతే, ఆ ఏకగ్రీవ ఎంపిక చెల్లదు," అని అన్నారు. ఇటువంటి వేలం పాటలు నిర్వహించే వ్యక్తులు లేదా సమూహాలపై భారత శిక్షాస్మృతి ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మరియు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, డబ్బు, మద్యం పంపిణీ చేస్తే నిబంధనల మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. లైసెన్సు పొందిన ఆయుధాలను తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్‌లలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీపీ విజయ్ కుమార్ హెచ్చరికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో సీఎం సభ భద్రతా ఏర్పాట్లు, పంచాయతీ ఎన్నికల నిఘా మరింత పటిష్టం కానుంది.