వరుస మరణాలు.. భయంతో ఊరు ఖాళీ!
- 3 నెలల్లో 28 మంది మృతి
కీడు సోకిందని వనభోజనాలకు..
కరీంనగర్ గండ్రపల్లిలో ఘటన
హుజురాబాద్, మార్చి 23 (విజయక్రాం తి): గ్రామంలో వరుస మరణాలతో తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్థులు.. ఊరికి కీడు సోకిందని భావించి ఊరును ఖాళీ చేసి వనభోజనాలకు వెళ్లారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామం లో గత మూడు నెలల్లో 28 మంది వివిధ కారణాలతో వరుసగా మరణించారు. ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదినకర్మలు పూర్తికాకుండానే మరొకరు మృతి చెందడం తో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. గ్రామానికి కీడు సోకిందని నమ్మారు. దీంతో గ్రామ పెద్దలు.. పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు.
ఒక రోజంతా గ్రామాన్ని ఖాళీ చేసి పొలాల్లో కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నా రు. సూర్యోదయం కాకముందే ఊరు వదిలి, సూర్యాస్తమయం తర్వాత గ్రామానికి చేరుకోవాలని, మధ్యలో ఎవరూ రాకుండా ఉం డాలని ముందుగానే నిర్ణయించుకున్నా రు. దీనికోసం ముందుగానే డప్పు చాటింపు వేసి గ్రామస్థులకు విషయాన్ని తెలియజేశారు. సోమవారం తెల్లవారుజామునే ఇళ్లకు తాళా లు వేసి గ్రామాన్ని ఖాళీ చేశారు. పొలిమేర అవతల ఉన్న పొలాల్లో కీడువంటలకు వెళ్లా రు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే కుటుంబ సభ్యులతో వండుకొని తిన్నారు. గ్రామంలో జరిగినవి సహజ మరణాలు అని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు హేతువాదులు అంటున్నారు.




