25-01-2026 07:59:13 PM
మైనార్టీ మహిళలకు 200ల కుట్టుమిషన్లు పంపిణి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు ప్రాధాన్యమిస్తూ 200 మంది మైనార్టీ మహిళ లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి మైనార్టీల సంక్షేమమే కాకుండా అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని అన్నారు.
మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్మెంటును సకాలంలో అందిస్తున్నామని, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా హాస్టల్, కోచింగ్ సెంటర్లు, వృత్తి శిక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని, మైనార్టీ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. విడతల వారీగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పకుండా లబ్ధి చెందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మైనార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మైనార్టీ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.