27 June, 2026 | 4:38 PM

గొర్రెల స్కాం ఈడీ దూకుడు!

14-06-2024 12:53 AM
  1. దర్యాప్తులోకి దిగిన జాతీయ సంస్థ
  2. పెద్ద తలలే టార్గెట్‌గా ముందుకు..
  3. లబ్ధిదారుల సమాచారం కోరిన ఈడీ 
  4. గొర్రెల, మేకల సహకార ఫెడరేషన్‌కు నోటీసు 
  5. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం విచారణ

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో కుంభకోణంపై విచారణ పతాక శీర్షికలకు ఎక్కుతున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌కు నోటీసులు జారీచేసింది. తమకు ఏమేం సమాచారం కావాలో ఈడీ జారీచేసిన నోటీసులో పాయింట్లవారీగా పేర్కొంది. మనీ లాండరింగ్ (పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం గొర్రెల కొనుగోలు పథకంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై తాము విచారణ చేస్తున్నట్టు అందులో వెల్లడించింది. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఎవరనే అంశంపైనే ఈడీ దర్యాప్తు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో సంచలనాలు బయటపడే అవకాశం కనిపిస్తున్నది. 

ఒక్కో లబ్ధిదారునివారీగా సమాచారం

ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం నుంచి డిప్యూటీ డైరెక్టర్ మాగిమై ఆరోక్కియారాజ్ నుంచి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ ఎండీకి నోటీసులు పంపించారు. ఇందులో మనీ లాండరింగ్ చట్టం కింద గొర్రెల కొనుగోలు పథకంలో జరిగిన ఫ్రాడ్‌ను విచారిస్తున్నామని స్పష్టంగా పేర్కొన్నారు. విచారణలో భాగంగా గొర్రెల కొనుగోలుకు సంబంధించిన సమాచారం/ఫైళ్లు కావాలని ఈడీ కోరింది. ఇందులో ప్రతి ఒక్క లబ్ధిదారుని పేరు, అడ్రస్, కాంటాక్ట్ ఫోన్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, బ్యాంకు పేరు తదితర సమాచారం మొత్తం జిల్లాలవారీగా కావాలని ఈడీ అడిగింది. అలాగే జిల్లాల వారీగా గొర్రెల అమ్మకందారుల పేర్లు, అడ్రస్, బ్యాంకు వివరాలు, కాంటాక్ట్ నంబర్లు ఇవ్వాలని కోరింది.

ఫెడరేషన్ నుంచి నిధులు ఎవరికి, ఎలా విడుదల చేశారు? ఆయా బ్యాంకుల వివరాలు కూడా కోరింది. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలు, బ్యాంకు సమాచారం.. లబ్ధిదారులకు గొర్రెలను రవాణా చేసిన ఏజెన్సీల వివరాలతోపాటు.. గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాల వివరాలు, రవాణా ఏజెన్సీలకు డబ్బులు ఎలా చెల్లించారనే సమాచారాన్ని కూడా ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. గొర్రెలకు అందించే ఫీడ్‌ను ఎక్కడి నుంచి తెచ్చారో వివరాలు ఇవ్వాలని అడిగింది. ఫీడ్‌ను అందించిన వెండర్ల వివరాలు, వారి బ్యాంకు అకౌంట్ల సమాచారం, ఎంతమేర చెల్లించారనే పూర్తి సమాచారాన్ని అందించాలని ఆ నోటీసులో ఈడీ స్పష్టం చేసింది. గొర్రెల కొనుగోలు స్కాంపై ఫెడరేషన్ అంతర్గతంగా విచారణ చేసి ఉంటే ఆ వివరాలు కూడా కావాలని కోరింది.

పెద్ద తలకాయలే టార్గెట్!

రాష్ట్రంలో నాలుగు కుంభకోణాలపై వేగంగా విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ దశలో గొర్రెల కొనుగోలు పథకంలో జరిగిన స్కాంలో ఈడీ ప్రవేశించి విచారణ చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది. గొర్రెల పంపిణీ పథకం అమలు చేసిన సమయంలో బీఆర్‌ఎస్ నేత తలసారి శ్రీనివాస్ యాదవ్ ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే తలసారి పీఏను కూడా నిందితుడిగా చేర్చారు. ఫెడరేషన్ ఎండీ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. 

ఉన్నట్టుండి ఇప్పుడు ఈడీ ఎంటరైంది. అందుకు కారణం నాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యహరించినవారి ఈ కుంభకోణంలో ఏమైనా పాత్ర ఉన్నదా అనేది తేల్చడానికేననే వాదన వినిపిస్తున్నది. ఇప్పటివరకు అధికారుల వరకే పరిమిత మైన విచారణ ఈడీ ప్రవేశంతో పై స్థాయిలో ఉన్న రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల వరకు వెళ్తుందని భావిస్తున్నారు.