8 April, 2026 | 4:12 AM

గ్లెండెల్ అకాడమీలో శేఖర్ రవ్జియాని సందడి

08-04-2026 01:40 AM

హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): గ్లెండేల్ అకాడమీ, సన్సిటీ, హైదరాబాద్‌లో గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ (జీఎస్జీ ) ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్ లెక్చర్ సిరీస్ (ఎల్‌ఎల్‌ఎస్)లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శేఖర్ రవ్జియాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సంగీత రంగంపై ప్రత్యక్ష అనుభవం కలిగించడంతో పాటు గ్లోబల్ స్థాయి అవకాశాలకు మార్గం సుగమమైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సెషన్‌లో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు గ్లోబల్ స్కూల్స్ శేఖర్ రవ్జియాని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (జీఎస్‌ఎస్‌ఆర్‌ఎస్‌ఓఎం)లో ప్రవేశ అవకాశాలు లభించాయి.సెషన్‌లో శేఖర్ రవ్జియాని క్రమశిక్షణ, నిజాయితీ, భావోద్వేగాలతో కూడిన సంగీత అభివ్యక్తి ప్రాముఖ్యతపై విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు.సంగీతం ఒక ప్రయాణమని, దానిలో నిరంతర అభ్యాసం అవసరమని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వాయిస్ ట్రైనింగ్, రిథమ్, స్టేజ్ ప్రెజెన్స్‌పై ప్రాక్టికల్ వర్క్‌షాప్, ప్రశ్నోత్తరాలు, విద్యార్థుల ప్రదర్శనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా ప్రతిభ గల విద్యార్థులను గ్లోబల్ స్కూల్స్ శేఖర్ రవ్జియాని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కోసం ఎంపిక చేశారు.

2020లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా సంగీత సిద్ధాంతం, గానం, ప్రదర్శన నైపుణ్యాలు, మ్యూజిక్ ప్రొడక్ష్ప శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు. కొందరు ప్రముఖ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి, శేఖర్ రవ్జియాని గరుడా మ్యూజిక్ లేబుల్ ద్వారా గ్లోబల్గా అరంగేట్రం చేశారు.

ఈ కార్యక్రమంలో గాయని పవిత్ర చారి కూడా పాల్గొని, విద్యార్థులకు గాన నైపుణ్యాలపై మార్గదర్శనం చేశారు.గ్లెండేల్ అకాడమీ డైరెక్టర్ మిను సలోజా మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, సృజనాత్మకతను వెలికితీస్తాయని అన్నారు. గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ కౌల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విద్యార్థులకు వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించి, వారి ప్రతిభను మెరుగుపరచడంలో దోహదపడిందని తెలిపారు.