01-02-2026 02:06:17 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 31 (విజయక్రాంతి): శనివారం ఉదయం హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్ర బిందువైన కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో తుపాకీ తూటాలు పేలాయి. సినిమా ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల ఘటనతో స్థానికులు, వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. ఏటీఎంలో నగదు జమచేయడానికి వచ్చిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. తుపాకీతో కాల్పులు జరిపి రూ. 6 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ ఘటనలో బాధితుడి కాలికి తీవ్ర గాయమైంది.
సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు క్లూస్ టీమ్స్, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ వేగవంతం చేశాయి. పోలీసుల కథనం ప్రకా రం.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన రిన్షాద్ నగరంలోని నాంపల్లి జనతా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటూ రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. దివాన్ దేవిడీలో హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం జనవరి 7న ఆయన రూ. 6 లక్షల నగదుతో హైదరాబాద్ చేరుకున్నారు.
అయితే అనుకున్న రేటుకు సరుకు దొరక్కపోవడం, కొను గోలు వాయిదాపడటంతో.. తన బంధువు మిష్బాన్ సలహా మేరకు ఆ నగదును తిరిగి తన బ్యాంకు ఖాతాలో జమచేయాలని రిన్షాద్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు అమీర్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీయం సెంటర్ వద్దకు చేరుకున్నారు.
ఆయన నగదు జమచేసే ప్రయ త్నంలో ఉండగా.. వెనుక నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా లోపలికి చొరబడ్డారు. క్షణాల్లోనే తుపాకీని రిన్షా ద్ కడుపు వద్ద పెట్టి, డబ్బు సంచిని ఇవ్వాలంటూ బెదిరించారు. ఆకస్మికంగా జరిగిన దాడితో షాక్ తిన్న బాధితుడు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. బాధితుడు లొంగకపోవడంతో రెచ్చిపోయిన దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఇందులో ఒక తూటా రిన్షాద్ కుడి కాలికి బలంగా తాకడంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూ లిపోయారు. ఇదే అదనుగా భావించిన దుండగులు క్షణాల్లో రూ. 6 లక్షల నగదు ఉన్న సంచితో పాటు, బాధితుడి బైక్ తాళా లు లాక్కొని.. బాధితుడి వాహనంపైనే అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వచ్చేలోపే దుండగులు మాయమయ్యారు.
బట్టలు మార్చుకుని మరీ..
దోపిడీ దొంగలు పక్కా రెక్కీ నిర్వహించి, పారిపోయే మార్గాన్ని కూడా ముందే సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలం నుంచి రిన్షాద్ బైక్‌పై పరారైన నిందితులు.. చాదర్‌ఘాట్ సిగ్నల్ మీదుగా నింబోలిఅడ్డా, అక్కడి నుంచి కాచిగూడ వైపు వెళ్లారు. అక్కడ కాచిగూడ రైల్వేస్టేషన్, చౌరస్తా సమీపంలో వాహనాన్ని వదిలేశారు. పోలీసులను ఏమార్చేందుకు అక్కడే తమ దుస్తులు కూడా మార్చుకుని, సాధారణ పౌరుల్లా కలిసిపోయి కాచిగూడ చౌరస్తా వైపు కాలినడకన వెళ్లిపోయినట్లు సీసీటీవీ దశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.
నిందితుల కోసం జల్లెడ..
ఈ ఘటనను హైదరాబాద్ పోలీసులు అత్యంత సీరియస్‌గా పరిగణించారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన తూటాల డొల్లలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ, పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
పౌరుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, నిందితులు ఎక్కడున్నా పట్టుకుం టామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. నగర ప్రజలు తమ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే ‘డయల్ 100’కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు విజ్ఞప్తి చేశారు.