calender_icon.png 9 May, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణయ్యకు క్షమాపణ చెప్పాలి

25-03-2025 12:00:00 AM

ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

పలు బీసీ సంఘాల నేతల డిమాండ్

ముషీరాబాద్, మార్చి 24: (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై బిసి నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పలు బిసి సంఘాల నేతలు  డిమాండ్ చేశారు. వేలాది ఉద్యమాలు చేసి, జీవోలను తీసుకువచ్చి కోట్లాది మందికి విశేషమైన సేవలు అందించిన ఆర్.కృష్ణయ్యను జాజుల విమర్శిం చడం సిగ్గుచేటని, జాజుల శ్రీనివాస్ గౌడ్ తక్షణమే భేషరతుగా ఎంపీ ఆర్. కృష్ణయ్యకు బహిరంగ  క్షమాపణ చెప్పాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

ఈ మేర కు సోమవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర  బిసి విద్యార్థి, యువజన సంఘం అధ్యక్షుడు రాంమూర్తి గౌడ్, బిసి నేతలు ర్యాగ రమేష్, నీల వెంకటేష్ ముదిరాజ్,  సి.రాజేందర్, అనంతయ్య, నిఖిల్ పటేల్ మాట్లాడుతూ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇటీవల ఒక సమావేశంలో తన స్థాయికి మించి ఆర్.కృష్ణ య్యపై తప్పుడు ఆరోపణలు చేశారని, భవిష్యత్తులో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే దేహశుద్ధి తప్పుదని, రాళ్ళతో దాడి చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఆర్.కృష్ణయ్య ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని, ఏ పార్టీలో చేరలేదని, రాజకీయ పార్టీలే పిలిచి ఆయనకు వదవులు ఇచ్చాయన్నారు. ఆయనకు పలు రాజకీయ పార్టీలు పదవులు కట్టబెట్టడం ఓర్వలేక, అధికార పార్టీలకు కొమ్ము కాస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. జాజుల మాత్రం రాజకీయ పార్టీలు, నాయకులతో కొమ్ము కాస్తూ రాత్రిళ్ళు డబ్బుల సంచులు తెచ్చుకుంటున్నారని వారు ఆరోపించారు. ఆయనపై ఆరోపణలు రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు సవాల్ విసిరారు.