02-12-2025 08:24:09 PM
చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు..
హనుమకొండ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలపై బీసీ జేఏసీ యుద్ధభేరి మోగించింది. ఈ క్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో హన్మకొండలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ లు హాజరై చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆ రెండు పార్టీలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీల బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, బీసీ సమాజం ముందు రెండు పార్టీలను దోషులుగా నిలబెడతామన్నారు.
బీసీ రిజర్వేషన్లు వచ్చుడో, కాంగ్రెస్ బిజెపి, పార్టీలను భూస్థాపితం చేసుడో అనే విధంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలతో పాటు, స్థానిక సంస్థల కోటాలో, విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లను కల్పించాలని ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీలను డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో బీసీ సమాజమంతా తమ గర్జనను వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు డా. చిర్ర రాజు గౌడ్, డా. సంగాని మల్లేశ్వర్, బోనగాని యాదగిరి గౌడ్, దొడ్డిపల్లి రఘుపతి, తమ్మేలా శోభరాణి, మాదం పద్మజ దేవి, తెల్ల సుగుణ, పల్లెపు సమ్మయ్య, అమరావది సారంగపాణి, చిర్ర సుమన్ గౌడ్, కరుణ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.