27 July, 2026 | 1:07 AM

రాజన్న ఆలయంపై నిధుల వర్షం

27-07-2026 12:00 AM

మరో 99.40 కోట్లు మంజూరు

ఇప్పటివరకు విడుదలైన నిధులు 249.40 కోట్లు

ఫలించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి

హామీ అమలు చేయని బీఆర్‌ఎస్, ప్రత్యేక శ్రద్ధ వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం

వేములవాడ జులై 26 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి మహర్దశ పట్టనుంది. ఆలయ సమగ్ర రూపురేఖలను మా ర్చేలా, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

క్షేత్ర అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.99.40 కోట్లు మంజూ రు చేస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా కేటాయింపులతో కలిపి రాజన్న ఆల య పునరుద్ధరణ, పరిసరాల విస్తరణ పనుల కోసం ఇప్పటివరకు విడుదలైన మొత్తం నిధులురూ.249.40 కోట్లకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ, పరిసరాల సుందరీకరణ, భక్తుల కోసం ఆధునిక క్యూలైన్ల నిర్మాణం, నూతన వసతి గృహాల కల్పన వంటి పనులను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.

గతేడాది 2023 బడ్జెట్‌లో రూ.50 కోట్లు, ఈ ఏడాది 2024 రూ.100 కోట్లు కేటాయించగా, తాజాగా మరో రూ.99.40 కోట్లు కేటాయించింది. దీంతో అభివృ ద్ధి పనుల్లో వేగం పెరగనుంది. ఆలయ ప్రాంగణం లో ఇప్పటికే 45 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. వేములవాడ ఆలయాభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆది నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, నిధుల మంజూరుకు సంబంధించిన జీవో లు వచ్చేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోనే ఆధ్యాత్మిక రత్నమైన వేములవాడను అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవాలయ అభివృద్ధి అథారిటీ (వీటిడీఏ) ఏర్పాటు చేసి, ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ ఆ హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రణాళికా లోపం, నిధుల విడుదలలో ఆలస్యం, భూసేకరణ సమస్యల కారణంగా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం  నిధుల విడుదల, పనుల నిర్వహణలో పారదర్శకత చూపుతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ విస్తరణ కల నెరవేరబోతుండటంపై స్థానికులు,  వ్యా పారులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.