27-11-2025 12:47:25 AM
రిజర్వేషన్ల తగ్గింపుపై భగ్గుమన్న బీసీ జేఏసీ
హైదరాబాద్, సిటీబ్యూరో నవంబర్ 26 (విజయక్రాంతి): 42 శాతం రిజర్వేష న్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికి తగ్గించడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నాంపల్లిలోని గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపు లాట జరిగింది. అనంతరం బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పచ్చి మోసం చేసిందని మండిపడ్డారు.
42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని నమ్మబలికి, ఇప్పుడు మాట మార్చడం దారుణమన్నారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా.. ఈ ఎన్నికల్లో బీసీలను రాజకీయంగా ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని నేతలు డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు బీసీ బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశా రు. అరెస్టయిన వారిలో యువజన సంఘాల జేఏసీ చైర్మన్ కనకాల శ్యాంకుర్మా, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్ సగర, వైస్ చైర్మన్ కాటేపల్లి వీరస్వామి, మహిళా నేతలు మని మంజరి, తారకేశ్వరి, తదితరులు ఉన్నారు.
అరెస్టులు అన్యాయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్
పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఉద్యమకారులను బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ పరామర్శించారు. అనంతరం జాజుల మాట్లాడుతూ.. రిజర్వేషన్ల తగ్గింపును జీర్ణించుకోలేక కడుపుమండి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని, జిల్లాల్లో మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.