calender_icon.png 27 November, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 వేల కోట్ల పవర్ స్కాం

27-11-2025 01:04:46 AM

రేవంత్‌రెడ్డి మిషనే.. కమీషన్

కొత్తగా మూడు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4౦ వేల కోట్లు కావాలి..

ఈ అప్పు ఎక్కడినుంచి తెస్తారు?

  1.   30 నుంచి 40% వరకు కమీషన్ దండుకునే ప్లాన్ 
  2. సోలార్ ఉత్పత్తిపై ఇంకా అతీగతీనే లేదు 
  3. కొత్త డిస్కమ్ తేవడమంటే.. ప్రయివేటీకరణ కోసమే 
  4. వాటాల పంపిణీల్లో తేడాలతోనే మంత్రుల మధ్య ఘర్షణ 
  5. మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపాటు

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్ల పవర్‌స్కామ్‌కు తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30 నుంచి 40 శాతం వరకు కమీషన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని  ఆయన విమర్శించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి  ఎప్పుడు ఏది మాట్లాడినా.. ఏమి చేసినా.. ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమీషన్. కమీషన్ ఎలా కొల్లగొట్టాలని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తుంది’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.

వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని, ఆ విషయాన్ని మంత్రుల కుటుంబసభ్యులే బయటకి వచ్చి వాటాల అంశాన్ని చెబుతున్నారని ఆయన చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హరీశ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు అధికారమిస్తే  అరాచకమే రాజ్యమేలుతుందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట  ఇప్పుడు రుజువవుతున్నదన్నారు.

క్యాబినెట్ సమావేశాలు ప్రజలకు మేలు చేసే అంశాలు, రాష్ట్రప్రగతి కోసం జరుగుతాయని, కానీ ఇప్పుడు వాటాలు, కమీషన్లు కోసమేనని క్యాబినెట్ మీటింగ్‌లు జరుగుతున్నాయని, రూ. 5 లక్షల కోట్లు దండుకునే కుట్రకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తెరలేపారని హరీశ్‌రావు  ఆరోపించారు. అధికా రంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా బీఆర్‌ఎస్ హయాంలో భూముల విషయం లో ఏం జరిగిందో విచారణ చేయిస్తామనడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ దోపిడీ బయటపడినప్పుడల్లా విచారణ, లేదంటే కమిషన్ వేస్తామంటూ రెండేళ్లుగా డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని, ల్యాండ్ స్కాం పై ఎందుకు సూటిగా సమాధానం చెప్పడం లేదని ఆయన నిలదీశారు. మొన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో భూ స్కాం, నిన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో పవర్ స్కాం జరిగిందన్నారు. 

తక్కువ రేటుకే నిర్మాణం, కరెంట్.. 

‘రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ లేదా జెన్‌కో ఏది తక్కువ వ్యయంతో నిర్మాణం చేపట్టి, తక్కువ రేట్‌కు కరెంట్ ఇస్తామని ముందుకొచ్చే సంస్థలకే అవకాశం ఇస్తామని అంటున్నారు. ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ. 12.23 కోట్ల ఖర్చు తో మొత్తం 2,400 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఎన్టీపీసీ డీపీఆర్ చేసుకున్నది. కానీ జెన్‌కో డీపీఆర్‌లో మాత్రం మెగావాట్ ఉత్పత్తికి రూ. 14 కోట్లు అవుతుందని స్పష్టం గా పేర్కొంది.

ఒక మెగావాట్‌కు  ఎన్టీపీసీ రూ. 12.23 కోట్లు  ఖర్చు చేస్తే.. జెన్‌కో మాత్రం ఒక మెగావాట్‌కు రూ. 14కోట్లు ఖర్చు చేస్తదని డీపీఆర్ లోనే ఉంది. ఇదంతా తెలిసి కూడా డ్రామా ఎందుకు రేవంత్‌రెడ్డి. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ఖర్చు చూస్తే మెగావాట్ కాస్ట్ వైటీపీపీ రూ. 8.63 కోట్లు, భద్రాద్రి రూ.  9.74కోట్లు, ఎన్టీపీసీ 12.23 కోట్లు. కానీ రేవంత్‌రెడ్డి నిర్మించబోయే పవర్ ప్లాంట్ కాస్ట్ పర్ మెగావాట్  రూ. 14 కోట్లు. ఈ 14 కోట్లు కూడా ఇనిషియల్ కాస్ట్ మాత్ర మే.

రామగుండం వద్ద పవర్ ప్లాంట్ నిర్మించేందుకు అంతా సిద్దంగా ఉంది. భూసేకరణ చేయాల్సింది లేదు, పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఎఫ్‌జీడీ నిబంధనల్లో సడలింపుల వల్ల మెగావాట్ ఉత్పత్తి కాస్ట్ కోటి రూపాయల వరకు తగ్గుతుంది. 800 మెగావాట్లు అంటే ప్రతి మెగావాట్ కు రూ. 7 కోట్లు అంటే మొత్తం రూ.  5600 కోట్లు అవుతుంది. రామగుండం, పాల్వంచ, మక్తల్ లో మొత్తం రూ. 15, 20వేల కోట్లు ధరలు పెంచి బడా స్కాంకు పాల్పడుతున్నారు’ అని హరీశ్‌రావు విమర్శించారు. 

అందినకాడికి దండుకునేందుకు.. 

విద్యుత్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ ప్లాంట్ దండుగ అన్న రేవం త్‌రెడ్డి ఇప్పుడు అదే పవర్ ప్లాంట్ పేరుతో అందినకాడికి దండుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2,400 మెగావాట్ల విద్యుత్ కోసం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం తెలంగాణకు తీరని అన్యాయం, చారి త్రక ద్రోహమని రేవంత్‌రెడ్డినే విమర్శించారని, ఇప్పుడు ఆయనే భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రంల ఏర్పాటుకు సిద్దమైయ్యారని తెలిపారు.

మార్కెట్లో రూ. 5కే యూనిట్ విద్యుత్  అందుబాటులో ఉందని, ఎన్టీపీసీ నుంచి తీసుకుంటే.. ఒక్కో యూనిట్‌కు రూ. 8 నుంచి 9 వరకు ఖర్చుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారని హరీష్‌రావు గుర్తు చేశారు.  800 మోగావాట్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం నాలుగైదేండ్లు పడుతుందని, అదనంగా పెరిగే ఇతర వ్యయాలు కలుపుకుంటే ప్లాంటు నిర్మాణ వ్యయం రూ. 10,880 కోట్ల నుంచి రూ. 14 నుంచి రూ. 15వేల కోట్లకు పెరుగుతుందని, కరెంట్ యూనిట్ కాస్ట్ రూ. 7.92 నుంచి రూ. 9 నుంచి రూ. 10కి  పెరుగుతుందన్నారు. ఫించన్, ఫీజు రీయింబర్స్‌మెంట్, అడిగితే డబ్బులు లేవంటున్న రేవంత్‌రెడ్డి 2,400 మెగావాట్ల ప్లాంట్లుకు ఖర్చయ్యే రూ. 50వేల కోట్లు ఎక్కడి నుంచి  తెస్తారో చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. 

గతంలోనే ఒప్పందం.. 

‘ఎన్టీపీసీ  స్టేజ్1లో భాగంగా నిర్మించిన (2800) మెగావాట్ల ప్లాంట్ నుండి యూనిట్‌కు రూ.4.88 నుంచి రూ.5.96 వరకు ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకున్నది. ఇప్పుడు అదే ఎన్టీపీసీ  స్టేజ్ 2లో భాగంగా 3,800  మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా 2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మిస్తోంది. 4.12 రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు మేం సిద్ధ్దంగా ఉన్నం, రాష్ర్ట విభజన చట్టంలో భాగంగానే మేం కట్టామని ఎన్టీపీసీ రాష్ట్రానికి చెప్పింది. 

2,400 మెగావాట్లు విద్యుత్  పంపిణీ చేస్తామని మూడు లేఖలు రాసింది. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ కరెంటు ఇస్తామని చెబుతుంటే ఎందుకు తీసుకోవడం లేదు. ఎన్టీపీసీని తిరస్కరించడం వెనుక ఉన్న మతలబేంటీ..? కేసీఆర్ ఎంతో ముందు చూపుతో నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్  ఏర్పాటుకు సంకల్పించారు.

బీఆర్‌ఎస్ హయాంలో 95శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును తమ గొప్పతనంగా చెప్పుకుంటున్నారు ’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘నాడు థర్మల్ ప్లాంట్లు వద్దన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పుడు  నోరెందుకు తెరవడం లేదు..? కమీషన్ల కోసమా..? వాటాల కోసమా..?’ అని  ప్రశ్నించారు.

థర్మల్ పవర్ ఉత్పత్తిని 2026 నాటికి 40 శాతం తగ్గిస్తామని, దాని స్థానంలో 2030 వరకు 20 వేల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఇంధన ప్లాంట్లు నిర్మిస్తామన్న క్లీన్ అండ్ గ్రీన్ పాలసీని పక్కన పెట్టారన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కు అప్పగించి మహిళలను ఓనర్లను చేస్తామన్న హామీకి అతీగతీ లేదన్నారు.

మీ తప్పులను ప్రశ్నిస్తే మాపై ఎంక్వైరీలా..? 

 ‘మేం  ప్రతిపక్షంగా ప్రజల తరుపున మీరు చేస్తున్న స్కాంలపై, అన్యాయాలపై ప్రశ్నిస్తే మాపై ఎంక్వురైలు అంటున్నావు. , మీ ఇష్టం ఉన్న ఎంక్వురైలు చేసుకో. ఇది నీ పంచాయతీ.. నా పంచాయతీ కాదు, ఇది తెలంగాణ బతుకు పంచాయతీ. మీ స్కాంలపై అవసరమైతే బీఆర్‌ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధం అవుతుంది. బిజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాకుంటే స్కాంలపై విచారణ జరపాలి. యాక్షన్ తీసుకోవాలని బీజేపిని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీశ్‌రావు తెలిపారు. 

ప్రైవేటీకరణ కోసమే కొత్త డిస్కమ్..

ఇప్పటికే ఉన్న  ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌కు అదనంగా మరొక కొత్త డిస్కమ్ తీసుకురావడమంటే వీటన్నింటిని ప్రయివేట్‌కు అప్పగించడానికి కుట్ర జరుగుతోం దని హరీష్‌రావు ఆరోపించారు. ఆదాయ మే రాని డిస్కంల నిర్వహణ ఎట్ల సాధ్యమైతదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి యాక్షన్ చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు.

పరిపాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి.. కమీషన్లు దండు కునేందుకు స్కాంలకు తెరతీసిండన్నారు. లగచర్ల, మూసీ, ఆర్‌ఆర్‌ఆర్, హెచ్‌సీయూ, హైడ్రా, ఇప్పుడు  పారిశ్రామిక భూములతో రూ. 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్‌కు చేస్తున్న కుట్రలను బీఆర్‌ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టినట్లు చెప్పారు. ఈరోజు 50వేల కోట్ల స్కాం బయటపెట్టామని, త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కాం,  పంపుడ్ స్కోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కాం బయటపెడుతామని హెచ్చరించారు.