30-07-2025 12:49:24 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట జులై 29 : ఎరువుల షాపుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలనీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోని సంకల్ప్, మన గ్రోమోర్ ఎరువుల దుకాణాలను, మదనపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి న కలెక్టర్ దుకాణం బయట రాసిపెట్టిన ఎరువు నిలువలను షాపు, గోదాములో ఉన్న నిలువలను పరిశీలించారు.
అంతేకాకుండా ఆన్లైన్ పి.ఓ.ఎస్ పోర్టల్ లో నిక్షిప్తం అయివున్న ఎరువుల నిలువులను పరిశీలించారు. రైతులకు అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు ఇవ్వాలని, అవసరానికి మించి ఎరువులు ఇచ్చి లేదా కృత్రిమ కొరత సృష్టిస్తే మాత్రం చర్యలు తప్పవని హె చ్చరించారు. డి. ఎ పి, యూరియా, జిప్సం వంటి ఎరువుల నిల్వలను పరిశీలించారు.
అమ్మిన ప్రతి ఎరువు బస్తా పూర్తి వివరాలు రికార్డులో నిక్షిప్తం చేయాలని, అన్ని ఎరువుల దుకాణాల బ యట నిలువ, ధరల సూచిక బోర్డు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఎ.డి. ఎ దామోదర్ ను ఆదేశించారు. అంతకుముందు మదనపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, జిల్లా వైద్య అధికారి అందుబాటు లో లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్య కేంద్రంలో ఉన్న మందుల నిల్వలు, ఈ.డి.డి రిజిస్టరు ను పరిశీలించారు. గర్భిణుల ఎ. ఎన్.సి పరీక్షలు సకాలంలో నిర్వహించి సాధారణ ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో వచ్చే రోగులకు తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా వంటివి పాజిటివ్ రిపోర్టు వస్తె ఎలిజా పరీక్షలకు టి హబ్ కు రక్త నమూనా పంపించాలని ఆదేశించారు.
పాము, కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. శ్రీనివాసులు, కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, మదనపూర్ తహసిల్దార్, వ్యవసాయ శాఖ ఎ.డి. ఎ దామోదర్, మండల వ్యవసాయ అధికారి జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.