16-05-2025 09:43:34 PM
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా, మందమర్రి పట్టణంలోని పాలచెట్టు పంచముఖి హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగి 25 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న రజితోత్సవ వేడుకలు, బందో బస్తు ఏర్పాట్లను శుక్రవారం బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసిపి ఏ రవికుమార్ మాట్లాడుతూ, మే 17 నుండి 22 వరకు నిర్వహించు రజితోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మే 17 నుండి మే 22 వరకు ఆరు రోజులపాటు దేవాలయ 25 సంవత్సరాల రజితోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం పట్టణంలో పాలచెట్టు సమీపంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రతిష్ట నిర్వహించడం జరిగిందని, విగ్రహ ప్రతిష్ట జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత వైభవంగా రజితోత్సవ వేడుకలను జరగనున్నాయని తెలిపారు.
ఈ ఉత్సవాలకు చిన్న జీయర్ స్వామి, అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి లు విచ్చేసి, ముగ్గురు యతీశ్వరుల పర్యవేక్షణలో రజితోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు, భక్తులు ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, భగవంతుని అనుగ్రహానికి అనుగ్రహ పాత్రులు కాగలరని తెలిపారు. ఆరు రోజులపాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయని, చివరి రోజైనా మే 22న హనుమాన్ జయంతి సందర్భంగా మహా కుంభ సంప్రోక్షణ, సీతారాముల కళ్యాణం మహోత్సవం, తీర్థ ప్రసాద గోష్టి ఉంటాయని, భక్తులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, అర్చకులు గోవర్ధనగిరి అనంత చార్యులు, కృష్ణ చైతన్య ఆచార్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.