16-05-2025 09:49:16 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని పాండవలంకలో భక్తులు లక్ష్మీ అమ్మవారి పట్నాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ధర్మారం, ఖానాపూర్ పలు గ్రామాల నుండి పాండవ బలగం భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన లక్ష్మీ అమ్మవారికి పుట్టినిల్లు అయిన పాండవ లొంకకు చేరుకొని అమ్మవారి ప్రతిమలను కోనేరులో స్నానమాచరించి, పట్నం వేసి, బోనం వండి, లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాండవ బలగం భక్తులు.
అంతకుముందు డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి విగ్రహాలను నెత్తిన పెట్టుకొని, శివసత్తుల పూనకాల మధ్య నృత్యాలు చేస్తూ తమ పాడి, పంట గ్రామ ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శివసత్తులు అమ్మవారి రూపంలో పూనకంతో నృత్యాలు చేశారు. అయితే పాండవులంకకు సరైన మార్గం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పాండవులంకకు రోడ్డు మార్గాన్ని కల్పించాలని, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి శ్రావణ మాసంలో పాండవులంకను సందర్శించి, లక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడమే కాకుండా, ఇక్కడి వాటర్ ఫాల్స్ ను తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు, పాండవలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని పాండవ బలగం భక్తులతో పాటు స్థానికులు కోరుతున్నారు.