టెండర్ రద్దుతో చేతులు దులుపుకోవడం కాదు
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
పాల్వంచ, ఆగస్టు 13, (విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్లో అవినీతి,అక్రమాలకు వ్యతిరేకంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న నిరంతర ప్రజా పోరాటానికి మరోసారి విజయం లభించిందని ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ పోరాటం నేపథ్యంలో డీపీఆర్ టెండర్ను రద్దు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
గురువారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో యెర్రా కామేష్ మాట్లాడుతూ..ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా,పారదర్శకతకు తావులేకుండా వ్యవహరిస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలపై న్యాయబద్ధంగా,నిరంతరం పోరాటం చేస్తే చివరకు అధికార యంత్రాంగం కూడా ప్రజల డిమాండ్లకు తలవంచాల్సిందేనని అన్నారు.
డీపీఆర్ టెండర్ రద్దు చేయడంతో సమస్య పూర్తయినట్లు అధికారులు భావించకూడదని‘,టెండర్ ప్రక్రియలో అవినీతి,అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేవలం ‘టెండర్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం ప్రజలను మోసం చేయడమే అని యెర్రా కామేష్ వ్యాఖ్యానించారు.కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే ఏ ప్రయత్నాన్నైనా జైభీమ్ రావ్ భారత్ పార్టీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు.
టెండర్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని, నిబంధనలను ఉల్లంఘించిన అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని, ఇప్పటికే డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్,తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ కు పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలపై జేబీపీ పోరాటం ఇక్కడితో ఆగదని యెర్రా కామేష్ తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్లో అవినీతి,అక్రమాలు,ప్రజా నిధుల దుర్వినియోగంపై పార్టీ నిరంతరం నిఘా ఉంచుతుందని అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని యెర్రా కామేష్ స్పష్టం చేశారు,డీపీఆర్ టెండర్ రద్దు ప్రజా పోరాటానికి వచ్చిన ప్రాథమిక విజయమేనని, అయితే అసలు బాధ్యులపై చర్యలు తీసుకున్న ప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, పాల్వంచ,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు నిట్టా నర్సింహ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.






