24-12-2025 08:01:22 PM
టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): దేశంలోనే ఘన చరిత్ర కలిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తగ్గించి నిర్వహించడానికి సింగరేణిలో గుర్తింపు సంఘం (AITUC) వైఫల్యమేనని టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో మంగళవారం స్థానిక టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణిలో సింగరేణి వేడుకలను తగ్గించి నిర్వహించడం సింగరేణి కార్మికులను అవమానించడమేనని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా సింగరేణి యాజమాన్యం నడుచుకుంటూ కోట్ల రూపాయలు వివిధ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నా.. ఉలుకు పలుకు లేని గుర్తింపు సంఘం, సింగరేణి వేడుకలకు కూడా డబ్బులు తగ్గించి ఇవ్వడాన్ని ఆపలేకపోయిందన్నారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పూర్తిగా అన్ని విషయాలలో వైఫల్యం చెందిందని, ఈ మధ్యకాలంలో వచ్చిన సర్కులర్లను ఆపలేకపోయిందని ధ్వజమెత్తారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్న ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. సింగరేణి వేడుకలను తగ్గించడానికి ఆపే శక్తి లేక గనుల మీద అడ్డుకున్నట్టు షో చేయడాన్ని ఎద్దేవా చేశారు.
ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లింపులు కూడా క్వార్టర్ ఖాళీ చేయాలని నిబంధన పెట్టడాన్ని ఆయన ఖండించారు. కొడుకుకు ఉద్యోగo ఇచ్చిన తర్వాత అతని పేరు మీద క్వార్టర్ చేయించుకునే అవకాశం ఉన్నదని ఒకపక్క ఉద్యోగాలు ఇవ్వకుండానే క్వార్టర్ ఖాళీ చేయలేదనే పేరు మీద రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ ఆపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది కూడా ఏఐటీయూసీ వైఫల్యమే అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అట్టి సర్క్యులర్ ను సరిచేయించి రిటైర్డ్ కార్మికులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్ కుమార్, బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఓ.రాజశేఖర్, సెంట్రల్ కమిటీ నాయకులు రాజనాల రమేష్, అశోక్, గోలేటి సిహెచ్పి ఫిట్ కార్యదర్శి మెరుగు రమేష్, బెల్లంపల్లి టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయ ఇన్చార్జి మైదం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.