calender_icon.png 1 August, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో బోగీలు పెంచండి సారూ?

11-08-2024 07:13:02 AM

  1. పీక్ అవర్స్‌లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు 
  2. రద్దీతో తప్పని ఇబ్బందులు 
  3. అదనపు బోగీలు పెంచాలని కోరుతున్న ప్రజలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైనది. నగరంలోని అధిక భాగం ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి మెట్రోను ప్రధాన రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. నాగోల్  రాయ్‌దుర్గ్ మధ్య గల బ్లూలైన్, మియాపూర్ మధ్య గల రెడ్‌లైన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో మెట్రోలో బోగీలు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఊపిరాడని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించడమేమో కానీ ముందుగా పాత మెట్రో కారిడార్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. 

ఆ సమయాల్లో కాలు పెట్టడం కష్టమే

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో సర్వీసులను నడుపుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు ఆఫీసులు, విద్యాసం స్థలకు వెళ్లే సమయంలో మెట్రోల్లో రద్దీ పెరుగుతోంది. ఉదయం 8 నుంచి 10 గం టల మధ్య, సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య పీక్ అవర్స్‌లో మెట్రోలో కాలు పెట్టాలంటే కూడా కష్టంగానే ఉంటోందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. మహిళలకు మరిన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతిరోజు సుమారు 1,20,000 మంది ఉద్యోగులు, 1,40,000 మంది విద్యార్థులు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు మెట్రో గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతిరోజు 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పలుమార్లు 5 లక్షలకు మించి ప్రయాణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అదనపు సర్వీసులతో సరి.. 

ప్రతిరోజు 57 మెట్రో రైళ్ల ద్వారా దాదాపు 1028 ట్రిప్పులతో సుమారు 25 వేల కిలోమీటర్లు.. 17.5 గంటల పాటు ఎల్‌అండ్‌టీ సేవలందిస్తోంది. దీనికితోడు ఇటీవల పెరిగిన రద్దీ దృష్ట్యా రోజువారీ షెడ్యూల్‌కు బదులు ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే సర్వీసులను నడుపుతుండగా..  శుక్రవారం రాత్రి 11.45 వరకు చివరి సర్వీసును అదనంగా నడుపుతోంది. అదేవిధంగా సర్వీసుల సమయాన్ని కూడా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రయాణించవచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో రైల్ , ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రస్తుతం ఉన్న రెడ్‌లైన్, బ్లూలైన్, గ్రీన్‌లైన్‌లను డిజైన్ చేశాయి. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్లు 6 బోగీలకు అనుగుణంగా నిర్మించినట్లు తెలుస్తోంది. కాబట్టి మెట్రో బోగీలను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. న్యూఢిల్లీలో ఎనిమిది బోగీలతో, చెన్నైలో ఆరు బోగీలతో మెట్రోలు నడుస్తున్నాయి. 

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రద్ధ చూపాలి

హైదరాబాద్ మెట్రోల్లో రద్దీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మూడు బోగీలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రద్దీ దృష్ట్యా మరో మూడు బోగీలను పెంచాలి. అందుకోసం సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రద్ధ చూపాలి. ప్రస్తుతం ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. బోగీలను పెంచితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బోగీలను పెంచడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది.  

 ఎం శ్రీనివాస్, సీపీఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి