11-08-2024 07:14:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తోంది. హైడ్రా పరిధి గ్రేటర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరింపజేయగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆక్రమణలకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. అందులో భాగంగానే చెరువులలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించి న పలు భవనాలను పోలీసుల భద్రత నడుమ శనివారం కూల్చివేసింది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి శివరాంపల్లి పోలీస్ అకాడమీ సమీపంలోని 42, 50 సర్వే నంబర్లలో బూమ్‌రుఖా ఉద్ దవాళ్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను, చందానగర్ ప్రాంతంలోని ఎర్ల చెరువులో భవన నిర్మాణాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో శనివారం తొలగించారు. బూమ్‌రుఖా ఉద్ దవాళ్ చెరువు ఎఫ్‌టీఎల్‌కు చెందిన 10 ఎకరాల భూమిని పరి రక్షించి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
బూమ్‌రుఖా ఉద్ దవాళ్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా సమాచారం అందుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే ముబిన్ తన అనుచరులతో కలిసి చెరువు వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు వారిని అరెస్టు చేసి కేశం పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు :హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్‌లో చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ తరహా నిర్మాణాలకు బిల్డర్లు, రియల్టర్లకు ప్రభుత్వ అధికారులు సహకరించినట్లయితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చెరువుల పరిసరా లలో ఇంటి స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేసే ముందు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.