calender_icon.png 31 July, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం-మల్కన్‌గిరి లైన్‌తో అభివృద్ధి

11-08-2024 07:06:14 AM

  1. కోల్ మైన్స్ కనెక్టివిటీకి ఈ రైల్వేమార్గం కీలకం  
  2. భద్రాచలానికి దేశవ్యాప్తంగా రైల్ కనెక్టివిటీ
  3. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): పాండురంగాపురం భద్రాచలం మల్కన్‌గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు తెలంగాణతోపాటు ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భద్రాచలం మల్కన్‌గిరి రైల్వే లైన్ ద్వారా కోల్‌మైన్ కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను మంజూరు చేసిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై శనివారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కోల్ మైన్ సహా గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటినీ అందించడమే కాకుండా విజయవాడ విశాఖ భువనేశ్వర్ కోల్‌కతాకు ప్రత్యమ్నాయంగా మారుతుందని తెలిపారు.

వరంగల్ భద్రాచలం అసన్‌సోల్ రైల్వే కనెక్టివిటీ ద్వారా విశాఖ మార్గంలో తుఫాను వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రత్యమ్నాయంగా ఉపయోగపడుతుం దని తెలిపారు. ఈ నూతన ప్రాజెక్టు ద్వారా జునాగఢ్- నబరంగ్‌పూర్  -జెయ్‌పూర్  -మల్కన్‌గిరి  -భద్రాచలం  -పాండురంగాపురం మధ్య రైల్వే కనెక్టివిటీ కలుగుతుందని చెప్పారు. 290 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త రైల్వే లైన్‌ను రూ.7,383 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్టు వివరించారు. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యమ్నాయ రైలు మార్గంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. టెంపుల్ సిటీ భద్రాచలానికి దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని ఈ లైన్ అందిస్తుందని తెలిపారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఊతం 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కలహాండీ, నబరంగ్‌పూర్, కొరాపుట్, రాయగడ, మల్కన్‌గిరి వంటి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఈ రైల్వే మార్గం దోహదపడుతుందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. దక్షిణాదిలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు త్వరగా బొగ్గు అందించడం, అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన కనెక్టివిటీ అందించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను అందిస్తుందని వెల్లడించారు. ఒడిశా, తూర్పు గోదావరి (ఏపీ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఉపకరిస్తుందని వివరించారు.

కొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా దక్షిణ ఒడిశా, బస్తర్ ప్రాంతాల నుండి దక్షిణాదికి 124 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా  కోటి పనిదినాలు కల్పించేందుకు అవకాశం ఉందని, 267 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను తగ్గింస్తుందని.. ఇది 3.80 కోట్ల మొక్కల పెంపకానికి సమానమవుతుందని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూతనం గా మంజూరైన జాల్నా జల్‌గాం రైల్వే లైన్ వల్ల అజంతా ఎల్లోరా గుహలను చేరుకునేందుకు రైల్వే కనెక్టివిటీ లభిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8 ప్రాజెక్టుల ద్వారా 800 కిలోమీటర్ల కొత్త లైన్‌తో పాటు 64 స్టేషన్లు నిర్మితమవుతాయని, ఇందుకు రూ.24,657 కోట్లు ఖర్చు అవుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, పీసీసీఎం కే పద్మజ, సీపీఆర్‌వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.