జూలై నెలాఖరికి సీతారామ నీరు!
- 1.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు ప్రణాళిక
దశలవారీగా సాగునీరు విడుదలకు ప్రభుత్వ నిర్ణయం
ఏడేళ్లకు కుదిరిన ముహూర్తం
నేడు ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి రాక
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామా ఎత్తిపోతల పథకం నుంచి దశలవారీగా రైతులకు సాగునీరు అందించేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించనున్నారు. 2016లో ఆప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తే, 2017లో అప్పటి రోడ్లు భవనాలశాఖ మంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల లేమి, అనేకల ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎట్టకేలకు ఏడేళ్లకు సాగునీరు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రూ.13,077 కోట్లు.. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు
ఈ ప్రాజెక్టు దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై ఉన్న ఆనకట్ట నుంచి బీజీ కొత్తూరు వరదకు 12 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం చేసి, అక్కడి నుంచి పంపుహౌజ్ ద్వారా మహబూబాబాద్ వరకు సుమారు 231 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ నిర్మాణం చేయాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220 కిలోమీటర్ల మేరకు ప్రధాన కాలువ నిర్మాణం చేశారు. జిల్లా పరిధిలో 1 నుంచి 8వ ప్యాకేజీ వరకు 104 కిలోమీటర్లు, సత్తుపల్లి ట్రంకులో 9 నుంచి 12వ ప్యాకేజీ వరకు 116.9 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ నిర్మించాలి. కాగా, 7వ ప్యాకేజీ కమలాపురం పంపుహౌజ్ నుంచి అన్నపురెడ్డి పల్లి మండలం వరకు నేటికి భూ సేకరణ పూర్తి కాక పోవడంతో కాలువ తవ్వకాలు జరగలేదు. ఈ పథకంలో మూడు చోట్ల పంపుహౌజ్‌లు నిర్మించారు. వాటి నుంచి నీటిని మోటర్లతో ఎత్తి కాలువల్లో పడేలా డిజైన్ చేశారు. ఇలా గోదావరి నుంచి వృథాగా పోతున్న 70.40 టీఎంసీల నీటిని సాగుకు మళ్లించి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
19,611 ఎకరాల భూసేకరణ
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 19,611.55 ఎకరాల భూమి అవసరమైంది. అటవీయేతర భూమి 13,593 ఎకరాలు, అటబీ భూమి 4,924 ఎకరాలు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం (ఎకో శాంచ్యురీ) భూమితో కలుపుకొని మొత్తం 19,611.55 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. నాన్ ఫారెస్టు భూములకు రూ.338 కోట్లు, ఫారెస్టు భూములకు రూ.276 కోట్లు మొత్తం రూ.402 కోట్లను చెల్లించినట్టు అధికారులు చెప్తున్నారు.
మూడు పంపుహౌజుల్లో పనులు పూర్తి
సీతారామ ఎత్తిపోతల పథకంలో గల మూడు పంపుహౌజుల నిర్మాణాలు పూర్తిచేసుకొని డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఒకటి, ములకలపల్లి మండలం ఓడ్డు రామవరం, కమలాపురం వద్ద రెండు పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది. మోటర్లు బిగించడం, సబ్‌స్టేషన్ల నిర్మాణం, విద్యుత్తు లైన్లు ఇప్పటికే పూర్తి చేశారు. విద్యుత్తు శాఖకు చెల్లించాల్సిన నిధులు కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ప్రొపైటరీ అరేంజ్‌మెంట్స్‌లో నిమగ్నమయ్యారు. దీనికి నెలరోజుల వ్యవధి పడుతుందని అధికారులు చెప్తున్నారు. అంటే జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో నీటిని ఎత్తి పోయడానికి ముహూర్తం ఉండేలా ఉంది.






