28-01-2026 06:33:42 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఇందిరానగర్ 6వ నంబర్ వార్డులో కొండయ్య ఇంటి సమీపంలో మురికి కాలువ నిండి రోడ్డుపై పారుతోంది. రోజూ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డంతా మురుగు నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్న కాలనీవాసులు, పాలకవర్గం ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.