calender_icon.png 28 January, 2026 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

28-01-2026 06:44:02 PM

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలలో అధికారులు విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల విధులపై జోనల్ ఆఫీసర్స్, ఎఫ్ ఎస్టీ, ఎస్ ఎస్టీ టీంలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి బుధవారం శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్  మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికీ సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహిం చాలని ఆదేశించారు. ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించడం, రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం, వీడియో రికార్డు చేయడం చాలా కీలకమని, ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని సూచించారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలతో సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. 

ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని సూచించారు. నగదు సీజ్ చేసే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని పేర్కొన్నారు. నగదు సీజ్ చేసిన సమాచారం ఐటీ అధికారులకు ఇవ్వాలని సూచించారు.సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియో గించిన వాహనాలు, కుర్చీలు, భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు, రికార్డ్ చేయాలని సూచించారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ప్రచార వాహనాలకు మున్సిపల్ కమిషనర్లు, లౌడ్ స్పీకర్లకు పోలీస్ ల నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు సమీప ఎస్ హెచ్ ఓ ల నుంచి ఎన్ఓసీ తీసుకున్న తర్వాత మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి వార్డు సభ్యుడు రూ. లక్ష వరకు ఎన్నికల వ్యయం చేయవచ్చని వెల్లడించారు. జోనల్ ఆఫీసర్స్ తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడు సార్లు తనిఖీ చేయాలని సూచించారు.

ఆయా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ వినియోగంలో ఉన్నాయా చూడాలని ఆదేశించారు. దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల రోజున అధికారులు, సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని తెలిపారు. స్థానికేతరులు ఇక్కడ ఉండకుండా చూడాలని సూచించారు. పోలింగ్ రోజున డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది జోనల్ ఆఫీసర్స్ తో పాటు వారికి కేటాయించిన వాహనాల్లోనే వెళ్లాలని స్పష్టం చేశారు.

ప్రతి రోజు అన్ని టీంలు నివేదికలను జిల్లా అధికారులు, పోలీస్ అధికారులకు పంపాలని సూచించారు. అనంతరం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్, ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.