28-01-2026 06:27:54 PM
– చిన్నాకు చెక్ పెట్టేందుకు బరిలో నియోజకవర్గ స్థాయి నాయకుని సతీమణి..?!
– ఆర్మూర్ పట్టణంలో తెరపైకి మరో వివాదం
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో 'చిన్నా' గుబులు పట్టుకుంది. ఈయన సతీమణి చైర్మన్ బరిలో ఉంటే తమ ఉనికి ఉండదని అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడు తన సతీమణిని పోటీలో దించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సైతం నిజమేనంటూ ఈ ప్రచారానికి బలం చేకూర్చుతున్నారు. ఇప్పటికే ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో ఏబీ శ్రీనివాస్ (చిన్న) సతీమణి శ్రీదేవి ముందున్నారు.
ఈయనకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు కొందరు నాయకులు హైదరాబాద్ వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. చిన్నాకు ఖరారు చేస్తే తాము పోతే చేయమని ఛైర్ పర్సన్ పీఠం కోసం పోటీ పడుతున్న నాయకులు కొందరు కౌన్సిలర్ అభ్యర్థులను తీసుకెళ్లి అధిష్ఠానానికే అల్టిమేటం జారీ చేరినట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం సీరియస్ అయినట్లు సమాచారం. ముందు పోటీ చేసి గెలిచి రావాలని ఆదేశించినట్లు సమాచారం.
అక్కడ పప్పులు ఉడకక పోవడంతో తాజాగా మరో ఎత్తుగడ వేస్తున్నారు. శ్రీదేవి చిన్నాకు చెక్ పెట్టాలంటే సమ ఉజ్జీ అయిన నియోజకవర్గ స్థాయి నాయకుడి వల్లే అవుతుందని ఈ ఎత్తుగడ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. తన సతీమణిని జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చిన 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దింపితే ఎలా ఉంటుందంటూ ఆ నాయకుడు పలువురితో చర్చించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు అయింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
కాగా గత ఎన్నికల్లో ఈ 19వ వార్డు జనరల్ రిజర్వ్ కావడంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవీ నర్సింహారెడ్డి విజయం సాధించాడు. ఈ పర్యాయం ఈ వార్డు మహిళకు రిజర్వేషన్ కావడంతో ఆయన తన సతీమణిని పోటీ చేయించే ఉద్దేశం లేక పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కశ్వప్ స్వాతి సింగ్ బబ్లు, మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ జ్యోతి మారుతిరెడ్డి, విజయ్ అగర్వాల్ కుటుంబానికి చెందిన మహిళ పోటీ చేయడానికి ఇదివరకే పార్టీ అధిష్టానానికి దరఖాస్తులు చేసుకున్నారు.
నియోజకవర్గ స్థాయి నాయకుడు తన సతీమణిని బరిలో దింపితే ఈ వార్డు నుంచి వీరు తప్పుకొని ఆయనకు మార్గం సుగమం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని ఉన్న ఏబీ శ్రీదేవి శ్రీనివాస్ (చిన్న)కు, రెండేళ్ల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గ స్థాయి నాయకునికి మధ్య చైర్ పర్సన్ పీఠం విషయమై పోటీ నెలకొంటే పార్టీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనే అంశంపై సైతం వీరు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
మరో వైపు శ్రీదేవి(చిన్న) బరిలో ఉంటే తాము ఖర్చు పెట్టుకొని పోటీ పడ్డా కూడా తమకు ప్రతికూల ఫలితాలే వస్తాయని భావించిన పలువురు ఆశావహులు చైర్ పర్సన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తమ అనుచరుల వద్ద స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ఈ ఇద్దరి నాయకుల మధ్య పోటీ ఎలా ఉంటుందోననే చర్చ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
ఆశావహులకు ఇక్కట్లు
అధికారపాటి నుంచి పోటీ చేయాలనుకునే కౌన్సిలర్ అభ్యర్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోవడంతో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు తలనొప్పిగా మారింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న వినయ్ రెడ్డి కి కొందరు ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటుండగా, మరికొందరు సీనియర్ నాయకుడు ఏబి శ్రీనివాస్ చిన్నా వద్ద దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇరువురు సైతం తమకు అనుకూలంగా ఉన్న పోటీదారులకు సంకేతాలు ఇచ్చి తమ తమ వార్డుల్లో పని చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఒకే వార్డులో ఇరు వర్గాలకు చెందిన నాయకులు పని చేసుకుంటున్నారు.
దీనివల్ల ఎవరికి టికెట్ ఖరారు అవుతుందోనని అయోమయానికి గురవుతున్నారు. మరికొందరు తమకు టికెట్ దక్కదనుకునేవారు బిఆర్ఎస్, బిజెపి వైపు మొగ్గు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చైర్పర్సన్ పీఠం ఏబీ శ్రీనివాస్ చిన్నా సతీమణి శ్రీదేవి పేరు దాదాపు ఖరారు అయినట్లు సంకేతాలు రావడమేగాక చిన్నాకు చెక్ పెట్టేందుకు నియోజకవర్గ స్థాయి నాయకుడు తన సతీమణిని పోటీలో నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతుండటంతో మాజీ, తాజా మాజీ చైర్ పర్సన్లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరు తన కోడలిని కౌన్సిలర్ గా పోటీ చేయించనున్నట్లు సమాచారం.