09-05-2025 11:24:23 PM
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేడ్ స్కూల్లో నిర్మాణంలో భాగంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి కావలసిన స్థలాన్ని ఆర్డీవో, ఇన్చార్జి ఎమ్మార్వో, స్థానిక నాయకులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే రెవిన్యూ అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు.
నియోజకవర్గ కేంద్రంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను గతంలో కోరారు.ఎమ్మెల్యే సూచన మేరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న సర్వేనెంబర్ 78లో మర్రివాగును ఆనుకుని ఉన్న పల్లె ప్రకృతి వనం నుండి దుబ్బకాలువ రోడ్డు వరకు వున్న భూమిని పరిశీలించారు... ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణానికి సరిపోయే విధంగా ఇక్కడే భూమి కేటాయించాలని రెవిన్యూ అధికారులకు చెప్పారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే మ్యాప్ ను పరిశీలించి అందుబాటులోకి తీసుకురావాల్సిన స్థలాలను గుర్తించాలన్నారు.
స్థల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కావలసిన స్థల సేకరణ పై సమీక్ష చేశారు... 78 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి లభ్యతకు సంబంధించి రెవిన్యూ అధికారులు సర్వే మ్యాప్ ప్రజెంటేషన్ చేశారు.మ్యాప్ ప్రకారం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని వీలైనంత తొందరగా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు.. దీనికి సంబంధించి కొన్ని మార్పులను చేర్పులను సూచించారు.స్థల పరిశీలనలో చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు ఇంచార్జ్ ఎమ్మార్వో నరేష్, సర్వేయర్ నాగేశ్వరరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు.