ఉత్తమ లేఖకు ఆరు ఆభరణాలు
అర్థక్రమః, సంబంధః,
పరిపూర్ణతా, మాధుర్యం,
ఔదార్యం, స్పష్టత్వం ఇతిలేఖాసంపత్!
(కౌటిలీయం
అర్థక్రమం, సంబంధం, పరిపూర్ణత, మాధుర్యం, ఔదార్యం, స్పష్టత అనేవి లేఖ కు సంపదలు లేదా లేఖకు ఉండదగిన ప్రధాన గుణాలు, అంటున్నాడు ఆచార్య చా ణక్య. లేఖ భావాన్ని పంచుకునే సాధనం. రాజ శాసనాలను తరతరాలుగా నిలిపేవి కూడా లేఖలే. విషయాన్ని కాగితంపై అక్షర రూపంలో పెట్టినప్పుడు, దానిని శాసనం అంటారు.
మాటల ద్వారా చెప్పినది శాస నం కాదనేది చాణక్య అభిప్రాయం. భాష వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనను కలిగిస్తుంది. సరైన భాషను, సరైన విధానం లో ఉపయోగిస్తే అసాధ్యాలు సుసాధ్యాలుగా మారిపోతాయి. వ్యక్తిత్వం పరిపూర్ణ తను సంతరించుకుంటుంది. వ్యక్తుల మ ధ్య సమ్మిళిత శక్తి పరిఢవిల్లుతుంది. సమా జం ప్రజ్ఞాభరితమవుతుంది. ఉత్తమమైన లేఖ అనేది జ్ఞానాన్ని ఆచరణలోకి తేగలిగిన మాధ్యమంగా చెప్పుకోవచ్చు.
చెప్పవలసిన విషయాన్ని అర్థవంతంగా, క్రమపద్ధతిలో కూర్చడం, ప్రధాన మైన విషయాన్ని ముందు చేర్చడాన్ని ‘అర్థక్రమం’ అంటారు. ఇందులో సమస్య, స మస్యకు కారణం, దాని పరిష్కారం.. వీటినొక క్రమంలో వివరించడమే అర్థక్రమం. ప్రస్తుత విషయానికి విరుద్ధమైన అంశాలు లేకుండా, తరువాతి విషయాలను కూర్చ డం ‘సంబంధం’ అంటారు.
ఉదాహరణగా ఒక వ్యక్తి వ్యవసాయం గురించి ప్రసంగిస్తూ మధ్యలో రాజకీయాన్ని ప్రస్తావిస్తే దానిని సంబంధం లేకుండా ప్రసంగిస్తున్నాడు అంటాం. అలాగే అర్థం, పదాలు, అక్షరాలు ఎక్కువ కాకుండా, తక్కువ కా కుండా ఉండడం (భావం చెడకుండా సంక్షిప్తంగా), తగిన హేతువులు, విషయాన్ని సమర్థించే సశాస్త్రీయమైన ఉదాహరణలు, దృష్టాంతాలు (లౌకికమైన తెలిసిన విషయాలు) చూపుతూ విషయాన్ని ప్రతిపా దించడం, చెప్పదలచిన విషయాన్ని స్పష్టం గా చెప్పడాన్ని ‘పరిపూర్ణత’ అంటారు.
భావానికి తగిన పొందికైన పదాలు వా డడం వల్ల ఆకర్షణీయమైన ప్రసంగంగా సరసజ్ఞులైన శ్రోతలను అలరిస్తుంది. అందమైన భావాన్ని, అర్థాన్ని, విషయాన్ని అనాయాసంగా బోధించగల శబ్దాలను ఎన్నుకొని ప్రయోగించడాన్ని ‘మాధుర్యం’ అంటారు. మృదువైన పదాలు లలితమైన భావనతో కలసి వినసొంపైన కంఠంతో ప్రసంగిస్తే లేదా రచిస్తే అది మధురంగా మారుతుంది. అర్థదోషాలు, శబ్దదోషాలు, అసభ్యకరమైన పదాలను ప్రయోగించకపోవడాన్ని ‘ఔదార్యం’ అంటారు. రచనలో కాని, ప్రసంగంలో కాని సంస్కారవంతమైన భాషను వాడాలి.
అప్పుడే అది ఔదా ర్యవంతమైన భాష అవుతుంది. ప్రసిద్ధమైన శబ్దాల ప్రయోగాన్ని ‘స్పష్టత’ అంటా రు. సాధారణ పాఠకులకు పరిచయంలేని, అరుదైన పదాలను వెదికి కూర్చి రచించినా.. ప్రసంగంలో వినియోగించినా అది తిరస్కారానికి గురవుతుంది. లలితమైన పదాలను అందరికి తెలిసిన భాషలో పలికిస్తే ప్రశంసలు అందుకుంటుంది. వీటిని సంతరించుకున్న వ్యక్తి సంభాషణలో కాని, రచనా వైభవంలో కాని, వేదిక పై ప్రసంగం చేయడంలో కాని ఉత్తమ వ్యక్తిగా గుర్తింపును పొందుతాడు.
ఒక పోటీ పరీక్షలో ముందు వరసలో ఉండాలంటే.. ఈ ఆరు లక్షణాలను క్షుణ్ణం గా అవగాహన చేసుకోవాలి. నిరంతర అభ్యసనం, ప్రతిభావంతమైన భాషా పాం డిత్యం, ఎప్పుడు ఎక్కడ ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకునే నైపుణ్యా న్ని కలిగిన వ్యక్తులు ప్ర భావశీలురై సమాజాన్ని నడిపిస్తారు. పైన చెప్పిన ఆరు లక్షణాలను వ్యాస రచనలోనూ, ప్రసంగాలలోనూ, ప్ర భుత్వ పరిపాలనా విభాగాలలోనూ, నివేదికలలోనూ, అధికారిక లేఖలలోనూ, సోష ల్ మీడియాలోనూ వాడతే విస్తృతంగా ప్ర జల ముంగిటికి చేర్చగలుగుతాము.
ఒక సరస్సులో కొన్ని హంసలు, ఒక తా బేలు స్నేహంగా ఉండేవి. ఎండాకాలంలో సరస్సులో నీరు తగ్గింది. హంసలు మరొక స రస్సుకు ఎగిరిపోతూ తాబేలునూ తమ తో రమ్మన్నాయి. సరేనంది తాబే లు. హం సలు ఒక కర్రను తెచ్చి దాన్ని నోటితో కరచి పట్టుకొమ్మని తాబేలుకు చెప్పి, కర్రను పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ పోతున్నాయి.
కిందనుంచి పిల్లలు అరవడం విన్న తాబేలు సంతోషంతో ఏదో చెప్పబోయి నోరుతెరిచి కిందపడి చనిపోయింది. సమయానికి అవసరమైన మాటలే పలకాలి. అనవసరమైన మాటలు వినాశనాని కి దారితీస్తాయి. ఇందులో స్పష్టత, పరిపూర్ణత, ఔదార్యం అనే లక్షణాలు ప్రతిబిం బిస్తున్నాయి.
ఒక అడవిలో ఓ సింహం బలమైన ఎ ద్దును చంపాలనుకున్నది. నేరుగా దాడి చే యకుండా.. దానితో స్నేహం చేసింది.. నమ్మకం కలిగించింది.. సమయం చూసి దానిని వేటాడింది. ఇందులో ఒక క్రమం ఉన్నది. క్రమం తప్పితే ఫలితం తప్పుతుంది. అలాగే.. ఒక కాకి చెట్టుపై పిల్లలను పెంచుకుంటున్నది. పాము ఆ పిల్లలను చంపుతున్నది. కాకి ముంగీస సాయంతో పామును చంపుతుంది. ఇందులో చర్యకు ప్రతిచర్య లేదా కార్యకారణ సంబంధం కనిపిస్తుంది.
ఒకప్పుడొక కోతి, మొసలి స్నే హంగా ఉండేవి. మొసలి భార్య కు కోతి గుండెను తినాలని కోరిక పుట్టింది. మొస లి కోతిని మోసగించి నీటిలోనికి తీసుకువెళ్తుంది. మోసాన్ని గ్రహించిన కో తి ‘తన గుండెను చెట్టుపై వదిలి వచ్చానని’ చెప్తుంది. మొసలి ఆ మాటలు నమ్మి వెనుకకు తిరుగుతుంది. కోతి ఒడ్డుకు చేరి త ప్పించుకుంటుంది. కోతి మృదువైన మాటలతో ‘మధురంగా’ మాట్లాడుతూ మొసలి ని మోసగించి, తెలివిగా తప్పించుకుంది.
ఒకసారి ఓ ప్రాంతంలో కరువు ఏర్పడింది. సంబంధిత విభాగ కార్యదర్శి, కార్య నిర్వహణాధికారికి ఉత్తరం రాశాడు.. ఫలా నా ప్రాంతంలోని గ్రామాల్లో కరువు ఏర్పడింది. మూడు నెలలకు సరిపడా ధాన్యా న్ని వెంటనే పంపించండి. ప్రతి గ్రామంలో నూ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి. ఆదేశాలను అమలు చేసిన నివేదికను ఒక వారం లో సమర్పించండి. ఇందులో భాష అలతి పదాలతో మనోజ్ఞంగా ఉన్నది. లేఖ సంక్షిప్తంగా ఉన్నది. ఏం చేయాలో స్పష్టత ఉన్నది. అధికారులు వెంటనే స్పందించా రు.. ప్రజలకూ సరైన సమయంలో సహా యం అందింది. ప్రయోజనం సిద్ధించింది. అంతేకాదు, ఈ లేఖలో అర్థక్రమాన్ని పాటించారు.
విషయానికి సంబంధించిన అనుసంధానం సహజంగా అమరింది, అవసరమైన వివరాలే ఉన్నాయి, భాషలో సంక్లిష్టత లేకుం డా మృదువుగా ఉన్నది, ఔదార్యమూ ఉ న్నది, స్పష్టతా ఉన్నది. అదే లేఖను అనేక అలంకార సహిత పదాలతో, సంబంధంలేని వివరాలతో, అత్యంత సంక్లిష్టమైన భాషతో, అస్పష్టమైన ఆదేశాలతో పొడవైన లేఖగా రాస్తే.. సహాయం ఆలస్యంగా అందేది. మాటలైనా, లేఖలైనా, నివేదికలైనా భావ స్పష్టత, పదాల పొందిక, సూటిగా చెప్పగలిగిన శైలితో ఉంటేనే ప్రయోజనాన్ని సిద్ధిస్తుంది. సుపరిపాలనకు ప్రాణంగా నిలుస్తుంది.
నిజానికి, చాణక్యుడు పేర్కొన్న అర్థక్రమం, సంబంధం, పరిపూర్ణత, మాధు ర్యం, ఔదార్యం, స్పష్టత అనే ఆరు ఆభరణాలు లేఖలకే కాదు, ప్రతి సంభాషణకు, ప్రతి రచనకు, ప్రతి నాయకత్వానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
పాలకుర్తి రామమూర్తి






