24 June, 2026 | 3:09 AM

విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

24-06-2026 02:02 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, జూన్ 23 (విజయక్రాంతి): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

మంగళవారం, జిల్లాలోని నర్మెట్ట మండలంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి, విత్తన మేళాలో గల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు.

రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాల్లో సన్న వడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డిఏపి వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో యూరియాను అధిక మోతాదులో వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని, శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. 

విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు, ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. విత్తన మేళాల్లో రైతులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పంట వంగడాలు, వాటి ప్రత్యేకతలు, దిగుబడి సామర్థ్యం, తెగుళ్ల నిరోధకత వంటి అంశాలపై వ్యవసాయ అధికారులు పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే, వర్షాభావాన్ని తట్టుకునే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందగలరని తెలిపారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం, పురుగు మందుల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని, నాణ్యమైన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ప్రతి రైతు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల సాగు చేపడితే దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయ వ్యయాలు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, సర్పంచ్ శ్రీధర్ గౌడ్, ఎంపీడీవో, ఏడీఏ, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.