చర్చలతో వాణిజ్యానికి ఊతం
అమెరికా మధ్య తాజాగా కుదిరిన అవగాహన ఒప్పందం పశ్చిమాసియా రాజకీయాలు, ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణా రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగల కీలక పరిణామంగా పరిగణించవచ్చు. గత కొన్ని నెలలుగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టాయి.
ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూసివేత, ఇంధన సరఫరాలో అంతరాయాలు, చమురు ధరల పెరుగుదల, సముద్ర రవాణా వ్యయాల భారం ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు పరస్పర చర్చల ద్వారా తాత్కాలిక శాంతి ఒప్పందానికి రావడం ప్రపంచవ్యాప్తంగా ఉపశమనం కలిగిస్తోంది.
ఈ ఒప్పందం ప్రకారం అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని దశలవారీగా ఎత్తివేయడానికి అంగీకరించగా, ఇరాన్ హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి అంగీకరించింది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వివాదాస్పద అంశాలను కూడా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఇరుదేశాలు ముందుకురావడం విశేషం. అమెరికా ఇరాన్‌పై కొత్తగా ఆర్థిక ఆంక్షలు విధించ బోమని హామీ ఇవ్వడమే కాకుండా, కొంతకాలం చమురు ఎగుమతులకు సడలింపులు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది.
ఇరాన్‌కు చెందిన నిధులను విడుదల చేసే అంశం కూడా చర్చల్లో చోటుచేసుకుంది. ప్రతిఫలంగా ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి దిశగా అడుగులు వేయబోమని, యురేనియం శుద్ధీ కార్య క్రమాన్ని విస్తరిం చబోమని అంగీకరించినట్లు సమాచారం. అమెరికా ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రధాన లక్ష్యాలను సాధిం చాలని ప్రయత్నించింది. మొదటిది హోర్ముజ్ ద్వారా అంతర్జాతీయ నౌకాయానాన్ని తిరిగి ప్రారంభించడం. రెండవది, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రిత చర్చల పరిధిలోకి తీసుకురావడం. మరోవైపు ఇరాన్ కూడా తనపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడం, చమురు ఎగుమతులను పునరుద్ధరించుకోవడం, నిల్వ నిధులను తిరిగి పొందడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందానికి ముందుకొచ్చింది.
అయితే ఈ ఒప్పందంపై అమెరికా మిత్రదేశాల్లో కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతు న్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, కొన్ని గల్ఫ్ దేశాలు ఇరాన్ ఆర్థికంగా బలపడితే ప్రాంతీయ ప్రభావాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఆంక్షల సడలింపులు, నిధుల విడుదల, చమురు విక్రయాలకు అనుమతులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, దీని వల్ల భవిష్యత్తులో వ్యూహాత్మక సమతుల్యత మారవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికా మాత్రం అణు కార్యక్రమంపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని, ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని వదల్లేదని స్పష్టం చేస్తోంది. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమైనది.
గత కొన్ని సంవత్సరాలుగా కరోనా అనంతర ప్రభావాలు, ప్రాంతీయ యుద్ధాలు, సరఫరా గొలుసు అంతరాయాలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరటనిస్తుంది. చమురు, సహజ వాయువు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం వల్ల ఇంధన ధరలు స్థిరపడే అవకాశం ఉంది. ఇప్పటికే చమురు ధరలు తగ్గుముఖం పట్టినట్లు అంతర్జాతీయ మార్కెట్లలో సంకేతాలు కనిపించాయి. అంతేకాదు, పరిశ్రమలు, తయారీ రంగాలు, ఎగుమతి దిగుమతి వ్యవస్థలు తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది. భారతదేశానికి కూడా ఈ పరిణామం ఎంతో ముఖ్యమైనది.
చమురు ధరల స్థిరీకరణ భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. దిగుమతి వ్యయం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొంటే భారతీయ కార్మికులు, వ్యాపార ప్రయోజనాలు కూడా మరింత రక్షితంగా ఉంటాయి. అయితే ఈ ఒప్పందం ప్రస్తుతం ఉద్రిక్తతలను తగ్గించే తాత్కాలిక అవగాహన మాత్రమే. అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై ఇంకా సుదీర్ఘ చర్చలు జరగాల్సి ఉంది. పరస్పర అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదని చెప్పాలి.
డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్






