ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి
- పంట మార్పిడితో భూసారం పెరుగుతుంది
- నారాయణపురం రైతుల సమస్యలు తొలగిపోతాయి
- పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనులు వేగం పెంచాలి
- మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్
కేసముద్రం, జూన్ 23 (విజయక్రాంతి): ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని, పంట మార్పిడి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన వరి విత్తనాలను సాగు చేసి, ప్రభుత్వం అందిస్తున్న బోనస్ పొందాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. కేసముద్రం రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రైతు సంక్షేమం కో సం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. మూస పద్ధతిలో పంటలు సాగు విధానానికి స్వస్తి పలికి, పంట మా ర్పిడి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను కోరారు. కేసముద్రం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను మరింత వేగవంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
నారాయణపురం రైతుల సమస్యలు తొలగిపోతాయి..
ఎన్నో ఏండ్ల తరబడి పట్టా పాస్ పుస్తకాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న కేసముద్రం మండలం నారాయణపురం రైతుల సమస్యలు ముగింపు దశకు వచ్చాయని, భూముల రీ సర్వే ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు పట్టా పాస్ పుస్తకం దాడి చేస్తామని కలెక్టర్ తెలిపారు. నారాయణపురం రైతులకు సర్వే ఆధారంగా పట్టా పాస్ పుస్తకాల జారీ కార్యక్రమానికి సంబంధించి ఈ కేవైసీ కార్యక్రమాన్ని కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయంలో పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, అర్హులైన ప్రతి రైతుకు పట్టా పాస్ పుస్తకం అందజేసి ప్రభుత్వ ప్రయోజనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర, హార్టికల్చర్ అధికారి మరియన్న, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, తాహసిల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, ఏవో వెంకన్న , తదితరులు పాల్గొన్నారు






