calender_icon.png 26 October, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 కోట్లతో మార్వాడి చిట్టి వ్యాపారి ఫ్యామిలీతో జంప్

26-10-2025 08:53:59 PM

లబోదిబోమంటున్న బాధితులు..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మెడికల్ షాప్ నిర్వహిస్తూ చిట్టి వ్యాపారం చేసే మార్వాడి వ్యాపారి కోట్ల రూపాయలతో కుటుంబంతో సహా పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మార్వాడి బజార్ లో నివాసం ఉంటున్న గోపాల్ రాటి అనే వ్యక్తి ఇందిరా చౌక్ నుండి రైల్వే స్టేషన్ మార్గం పాత బిజెపి కార్యాలయం ముందు గత కొన్నేళ్లుగా మెడికల్ షాపు, మెడికల్ ఏజెన్సీతో పాటు చిట్టిల వ్యాపారం కూడా చేస్తున్నాడు. అతడి వద్ద పేద, మధ్య తరగతి, వర్గాల ప్రజలతో పాటు అనేకమంది బడా వ్యాపారస్తులు సైతం చిట్టీలు వేస్తున్నారు.

కొన్నేళ్లుగా చిట్టీలు వేస్తున్న వారికి డబ్బులు తిరిగి చెల్లించాడు కూడా.. ఇదే నమ్మకంతో మరి కొంతమంది సైతం భారీ స్థాయిలో డబ్బులు జమ చేసి చిట్టిలో వేశారు. దీపావళి పండుగకు కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులతో కలిసి పాల్గొన్నాడు. అయితే దీపావళి పండుగకు ముందు కొంతమందికి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో గత నాలుగైదు రోజుల నుండి అతడి ఇంటికి బారులు తీరారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ అతడు కుటుంబ సభ్యులతో కలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు. దాదాపు పది నుండి 12 కోట్ల రూపాయలతో ఉడాయించిన గోపాల్ రాటి చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.